కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మురుగేశ్ నిరాని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. కార్యకర్తల చేత ఇంటింటికి ఉచితంగా చక్కెర ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.
అయితే చక్కెర ప్యాకెట్లను పంచుతున్న సమయంలో కార్యకర్తలకు షాక్ ఇచ్చింది ఓ మహిళ. చక్కెర ప్యాకెట్ ఇచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా.. ఆమె వాటిని తిరస్కరించింది. అయినా కార్యకర్తలు ఇంటి లోపలికి వెళ్లి చక్కెర ప్యాకెట్ ఇచ్చేందుకు యత్నించినా.. ఆమె తిరిగి వారికే ఇచ్చింది. దీంతో చేసేదేంలేక కార్యకర్తలు వెనుదిరిగారు. బాగల్‌కోట్ జిల్లాలోని గలగలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను చుట్టుపక్క వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మహిళను అభినందిస్తున్నారు. "మాకు సమస్యలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులెవ్వరూ స్పందించరు. కరోనా సమయంలో కనీస సాయం కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చక్కెర ప్యాకెట్లు పంచుతున్నారు. కాబట్టే నేను వాటిని తీసుకోలేదు" అని ఆ మహిళ తెలిపింది.