బిహార్ కైమూర్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను బావిలో తోసి.. ఆమె అందులో దూకేసింది. ఈ దారుణం భగవాన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలికి తన భర్తతో ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఇంట్లో ఆమె కనిపించకపోవడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి కోసం వెతికారు. ఈ క్రమంలో మహిళ చెప్పులు బావిలో తేలి కనిపించాయి. అనంతరం.. మహిళ, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మట్టి దిబ్బలు కూలి..
రాజస్థాన్ కరౌలీలోని సిమిర్ గ్రామంలో దారుణం జరిగింది. మట్టి దిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు బాలికలు ఉన్నారు. గ్రామానికి చెందిన మహిళలు, బాలికలు రోడ్డుపై వెళ్తుండగా మట్టి దిబ్బ కూలిపోయింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే గ్రామస్థలు సహాయకచర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. సోమవారం జరిగిందీ ఘటన.
చిన్నారిని చంపేస్తానని..
పంజాబ్ లుధియానాలో ముందియన్ ఖుర్ద్ కాలనీలో దారుణం జరిగింది. చిన్నారిని చంపేస్తానని బెదిరించి ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్. నిందితుడి ఇంట్లో 20 రోజులు క్రితమే బాధితురాలి కుటుంబం అద్దెకు దిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు గుర్దీప్ సింగ్ బజ్వా ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త ఇంటికి వచ్చేసరికి నిందితుడు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు.
భార్యను చంపిన వృద్ధుడు..
కర్ణాటక దావణగెరెలో దారుణం జరిగింది. 78 ఏళ్ల వృద్ధుడు తన భార్యను గొంతు కోసి హతమార్చాడు. ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. నిందితుడు చమన్సాబ్ను ఆజాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు షకీరాబా(70) మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత 50 ఏళ్లుగా ఈ వృద్ధదంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని స్థానికులు చెప్పారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ.. వారిమీద ఆధారపడకుండా వేరేగా ఉంటున్నారు. నిందితుడు చమన్‌సాబ్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఆయన కుమారులు తెలిపారు. ఆదివారం రాత్రి చిన్న గొడవ ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
బతికి ఉండగానే..
రాజస్థాన్‌లో అల్వార్‌లో ఓ వృద్ధురాలు బతికి ఉండగానే తన మరణ తేదీని నిర్దేశించుకుంది. ఆ రోజు తాను చనిపోవాలనుకుంటున్నాని అందరికీ చెప్పడంతో అక్కడికి భారీ సంఖ్యలో గ్రామస్థులు చేరుకున్నారు. ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి ఆమెతో కూర్చుని మద్దతుగా విషాద గీతాలు ఆలపించారు. ఖేద్లీ నగరంలో ఈ వింత ఘటన జరగగా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉందని, ఇంట్లో వారు కూడా సర్దిచెప్పినా వినకుండా ఇలా చేసిందని కుటుంబీకులు వివరించారు.
ఇవీ చదవండి: శివసేన గుర్తు కోసం ఠాక్రే న్యాయపోరాటం.. ఈసీ ఆదేశాల రద్దుకు హైకోర్టులో పిటిషన్
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..