సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకంపై యువకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. వివిధ రాష్ట్రాల్లో అనేక రైళ్లను అధికారులు నిలిపివేశారు. కొన్ని రైళ్లను రద్దు కూడా చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ-హౌరా ప్రధాన మార్గంలో రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఘాజీపుర్‌లోని జమానియా రైల్వేస్టేషన్లో నిలిచిన దానాపూర్-ఆనంద్ విహార్ రైలు నిలిచిపోవటం వల్ల ఓ మహిళ అందులోనే ప్రసవించిది. పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
బిహార్‌కు చెందిన గుడియా దేవి(28) నిండు గర్భిణీ. ఆమె మొరాదాబాద్ నంచి భగల్పుర్ వెళ్లేందుకు దానాపుర్-ఆనంద్ విహార్ రైలు (13258) ఎక్కింది. నిరసనల కారణంతో ఆ రైలు ఘాజీపుర్‌లోని జమానియా రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె రైలులోనే ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్టేషన్ ఎస్డీఎం ఆదేశాల మేరకు అధికారులు.. తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
చికిత్స కోసం వెళ్తూ వ్యక్తి మృతి.. అదే రైలులోని స్లీపర్ కోచ్ డి-11లో ప్రయాణిస్తున్న పట్నాలోని విక్రమ్ గ్రామానికి చెందిన రామేశ్వర్ (55) గత కొద్దిరోజులుగా గుండె సమస్యలతో బాధపడుతున్నాడు. అకస్మాత్తుగా రైలులో అతడికి గుండెనొప్పి తీవ్రమైంది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల కొద్దిసేపటికే అతడి పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్‌లో అతడ్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అధికారులు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడు దిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడని ఆయన సహచరుడు సాదీసోపూర్ చెప్పారు. మరోవైపు, రైల్ యాత్రీ కళ్యాణ్ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో నీరు, బిస్కెట్లతో సహా ఉచిత ఫలహారాలు ఏర్పాట్లు చేసింది.
ఇవీ చదవండి: ప్రియురాలు, ఆమె సోదరుడిని సుత్తితో కొట్టి చంపిన బాయ్‌ఫ్రెండ్!