Wife Conducted Final Rites to Her Husband in Home at Kurnool: ఇంట్లో ఎవరైనా మరణిస్తే... కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్మశానవాటికకు తీసుకువెళ్లి.. దహన సంస్కారాలు చేస్తారు. కానీ.. భర్త మరణించిన విషయం తెలిసి ఏకంగా.. ఇంట్లోనే తగలబెట్టేసింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సంచలనంగా మారింది.
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని చింతకాయల వీధిలో ఉంటున్న హరికృష్ణప్రసాద్(60), లలిత దంపతులు మెడికల్ షాపు నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు దినేష్ కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. కెనడాలో స్థిరపడిన చిన్న కొడుకు ముఖేష్ సైతం డాక్టర్. 2016లో హరికృష్ణప్రసాద్కు గుండె నొప్పి రావటంతో.. వైద్యం చేయించారు. 2020లో పెద్ద కొడుకు దినేష్ పెళ్లి చేశారు. గత కొంతకాలంగా భర్త ఆరోగ్యం క్షీణిస్తుండటంతో.. మంచానికే పరిమితం అయ్యారు. ఓ వైపు దుకాణం నిర్వహిస్తూనే.. భర్తకు భార్య సపర్యలు చేస్తున్నారు. ఈ ఉదయం మరోసారి గుండెపోటు రావటంతో భర్త మృతి చెందినట్లుగా లలిత నిర్ధారించారు.
భర్త మృతి చెందిన విషయాన్ని గుర్తించిన భార్య.. పెద్దకొడుకు పోతుగంటి దినేష్ కుమార్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే దినేష్ డెయిల్ 100 కు ఫోన్ చేసి.. పోలీసులకు విషయం తెలిపారు. తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని భావించిన లలిత.. భర్త మృతదేహంపై పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, బట్టలు వేసి నిప్పంటించింది. పెద్దఎత్తున పొగలు రావటంతో స్థానికులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చేలోగా మృతదేహం 90 శాతానికిపైగా కాలిపోయింది.
కుమారుడు దినేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు గత కొన్నేళ్లుగా... లలిత ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని.. మానసిక స్థితి బాగాలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దినేష్ ఇచ్చిన ఫిర్యాదులోనూ తన తల్లి మానసిక స్థితి బాగా లేదని పేర్కొనటం గమనార్హం.
'భర్త చనిపోయిన విషయాన్ని పిల్లలకు చెపుతామంటే వాళ్లు అందుబాటులో లేరనే కారణంతోనే తానే భర్తకు అంత్యక్రియలు చేసినట్లు లలిత చెబుతోంది. గత కొంత కాలంగా ఆమె భర్త మంచానికే పరిమితమయ్యాడు. ఆమె అతన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె భర్త మృతి చెందాడు.. తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని భావించిన లలిత.. తన కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. భర్త మృతదేహంపై పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, బట్టలు వేసి నిప్పంటించింది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు.'- మురళీ మోహన్, పత్తికొండ సీఐ