EKNATH SHINDE MAHARASHTRA: ఒకప్పుడు రిక్షా తొక్కితేనే పొట్టగడిచే పరిస్థితి ఆయనది.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారాయన.. ఠాక్రేను దించేయాలన్నా.. భాజపాను గద్దెనెక్కించాలన్నా ఆయన చేతిలో పనే! ఆయన నిర్ణయంపైనే మహా వికాస్ అఘాడీ సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంది. బాలాసాహెబ్ స్ఫూర్తితో రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా మారి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్లో మకాం పెట్టి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన ఆయనే.. ఏక్నాథ్ శిందే.
Maharashtra political crisis 2022: శివసేనలో ఏక్నాథ్ శిందే స్థానం చాలా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అందువల్లే ఆయన ఫిరాయింపు.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏక్నాథ్. 1980లలో శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు శిందే. అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్‌నగర్ బ్రాంచ్ హెడ్‌గా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఠాణె జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఆయన శివసేనపై తిరుగుబాటు చేసి గుజరాత్, సూరత్‌లోని ఓ హోటల్లో ఉన్నారు. ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సంఖ్యపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చే సత్తా ఆయనకు ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసినా.. లేదా తమ శాసనపక్షాన్ని భాజపాలో విలీనం చేసినా.. మహావికాస్ అఘాడీ సర్కారు పడిపోయే ఛాన్సుంది. అయితే, ఏక్నాథ్ శిందే తిరుగుబాటుకు కారణం ఏంటి? శివసేనలో ఇన్నేళ్లు బలమైన నేతగా ఉన్న ఆయన.. ఎందుకు జెండా ఎత్తేశారు? ఇందుకు నాలుగు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొదటిది.. ఉద్ధవ్ ఠాక్రే
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ శిందే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ బాధ్యతలన్నీ ఠాక్రే ఒక్కరే చూసుకుంటున్నారని, ఇది శిందేకు నచ్చలేదని తెలుస్తోంది. మహా వికాస్ అఘాడీ ఏర్పడిన సమయంలో శిందే కీలకంగా వ్యవహరించారు. అప్పుడే శివసేన సభాపక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని తనకు ఇస్తారని శిందే ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా.. ఠాక్రే కుటంబంలో ఎన్నడూ లేని రీతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల్లో భాగంగానే పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖలను ఠాక్రే.. ఏక్నాథ్ శిందేకు అప్పగించారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంజర్ రౌత్‌కు ప్రాధాన్యం..
మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుండి నడిపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చర్చలు జరపడంలో రౌత్.. కీలకంగా వ్యవహరించారు. పార్టీ తరఫున ప్రతి విషయంపైనా ఆయనే స్పందించేవారు. ఇప్పటికీ శివసేనలో ప్రధాన హోదాలో ఉన్నారు. ఇది కూడా ఏక్నాథ్ శిందేకు నచ్చట్లేదని తెలుస్తోంది. వ్యూహాత్మక సమావేశాలకు, చర్చలకు తనను దూరం పెడుతున్నారన్న భావన ఆయనలో ఏర్పడింది. ఇది అసంతృప్తిని పెంచింది.
ఆదిత్య ఠాక్రే బ్రాండింగ్
ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన తర్వాత.. ఆయన తన తనయుడిని కేబినెట్లోకి తీసుకోవడం, తర్వాతి సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడంపై ఏక్నాథ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన చర్చల్లో ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య పేర్లు వినిపించాయి. తన పేరును అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న భావన ఆయనలో పెరిగింది. ఉద్ధవ్ తర్వాత అయినా తనకు సీఎం పదవి దక్కుతుందనే ఆశతో ఉన్న ఏక్నాథ్ శిందేకు ఇది ఏమాత్రం రుచించలేదు.
పక్కదారి పట్టించారని..
బాలాసాహెబ్, ఆనంద్ దిఘే తర్వాత రాజకీయాలపై గట్టి పట్టున్న నేతగా ఏక్నాథ్ శిందే ఎదిగారు. ఠాణెలో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. అయితే, ఇటీవల తన ఇమేజ్ తగ్గిపోయిందని శిందే భావిస్తున్నారు. అందుకే సన్నిహిత ఎమ్మెల్యేలతో విడివిడిగా ఉంటున్నారు. ఠాక్రే పుట్టినరోజు వేడుకలకు హాజరైన సమయంలోనూ తన గ్రూపు ఎమ్మెల్యేలతోనే వచ్చారు. వెళ్లేటప్పుడు వారిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఔరంగబాద్‌లో నిర్వహించిన పార్టీ వార్షికోత్సవంలోనూ అంటీముట్టనట్టుగానే ఉన్నారు.
చేసిందంతా ఆయనే!
గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయనే ప్లాన్ వేశారని సమాచారం. రెబల్ ఎమ్మెల్యేలందరికీ ఆయనే సూరత్‌లో ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన సూరత్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసినట్లు సమాచారం. మంగళవారం యోగా దినోత్సవం సందర్భంగా గాంధీ నగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన పాటిల్.. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో యోగా సెషన్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఉదయం 11 గంటలకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను కలిశారు. సీఆర్ పాటిల్ కూతురు ధర్తీ దేవరె 2021లో మహారాష్ట్రలో నిర్వహించిన జిల్లా పరిషద్ ఎన్నికల్లో శివసేన అభ్యర్థిపై గెలిచారు. అప్పటి నుంచి పాటిల్.. మహారాష్ట్ర రాజకీయాలపై పరోక్షంగా దృష్టిసారించినట్లు సమాచారం.
మరోవైపు, శివసేన రెబల్ ఎమ్మెల్యేలను గాంధీనగర్ లేదా అహ్మదాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో, మహారాష్ట్ర భాజపా తన 105 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీరందరినీ గుజరాత్‌లోని సనంద్ రిసార్టులకు తరలించాలని యోచిస్తోంది. అహ్మదాబాద్‌కు వీరిని ప్రైవేటు విమానంలో పంపించాలని ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం సాయంత్రానికి వీరిని అహ్మదాబాద్‌కు తరలించి, అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే హోటల్లో వీరిని ఉంచనున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని సనంద్ ప్రాంతంలో ఉన్న క్లబ్‌ను ఇందుకోసం ఎంచుకున్నట్లు సమాచారం. ఈ క్లబ్ యజమాని భాజపాకు అత్యంత ఆప్తుడు. భాజపా నిర్వహించే అధికార కార్యక్రమాలు, రహస్య కార్యకలాపాలకు ఇదే అడ్డా. అందువల్ల ఇక్కడైతే ఎమ్మెల్యేలు సేఫ్ అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మహాలో నెక్ట్స్ ఏంటి?
ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రతిష్టంభనే నెలకొంది. చిన్నపార్టీలకు చెందిన 29 మంది శాసనసభ్యులు, స్వతంత్రుల మద్దతు ఎవరికి ఉంటుందనే విషయంపైనే తదుపరి ఎవరు అధికారం చేపడతారనే విషయం ఆధారపడి ఉంది. 288 సభ్యులు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. అధికారం చేపట్టేందుకు 144 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది.
2019 నవంబర్‌లో మహావికాస్ అఘాడీ 169 మంది ఎమ్మెల్యే మద్దతుతో అధికారం చేపట్టింది. ప్రస్తుతం శివసేనకు 55 మంది, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భాజపాకు 106 మంది సభ్యుల బలం ఉంది. 13 మంది స్వతంత్రులు ఉన్నారు. ఇందులో ఆరుగురు భాజపాకు, ఐదుగురు శివసేనకు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీకి ఒక్కో ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉంది. వీరితో పాటు.. ప్రస్తుతం శివసేనకు మద్దతిస్తున్న నవసేన, ప్రహార్ జనశక్తి పార్టీలు ఇకపై ఏ నిర్ణయం తీసుకుంటాయనే విషయంపై సమీకరణాలు ఆధారపడనున్నాయి.
ఇదీ చదవండి: