మహారాష్ట్ర కొల్హాపుర్‌లో కోట్ల విలువ చేసే అంబర్‌గ్రీస్‌ను (తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదున్నర కోట్ల విలువచేసే అంబర్‌గ్రీస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
సాంగ్లీ పట్టణంలోని శామ్రావ్ నగర సమీపంలో అంబర్‌గ్రీస్‌ను విక్రయించేందుకు కొందరు వస్తున్నట్లు స్థానిక నేర పరిశోధన విభాగానికి సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లి సోదాలు చేయగా.. తెల్లటి పెట్టెలో ఎనిమిది పసుపు, గోధుమ రంగు దీర్ఘచతురస్త్రాకార వస్తువులు కనిపించాయి. అందులో ఐదున్నర కిలోల బరువున్న అంబర్‌గ్రీస్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.ఐదు కోట్ల 71 లక్షలుంటుందని పోలీసుల అంచనా వేశారు.
ఈ ఘటనలో పటేల్, అక్బర్ షేక్‌లను అరెస్టు చేసినట్లు కొల్హాపుర్ రీజియన్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ ఫులారి తెలిపారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ అంబర్గ్రీస్కు డిమాండ్ ఉందని, అందుకే వీటిని రహస్యంగా తరలిస్తున్నట్లు సునీల్ చెప్పారు. అంబర్‌గ్రీస్‌ను మాల్వాన్ నుంచి సాంగ్లీకి విక్రయానికి తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.