West Bengal municipal polls: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పది నెలల తర్వాత నిర్వహించిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ ప్రత్యర్థులను క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపా.. ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోకుండా చతికిల పడింది. కాంగ్రెస్ సైతం సున్నాకే చాపచుట్టేసింది.
West Bengal municipal poll results:
27మున్సిపాలిటీలలో విపక్షాలు అసలు ఖాతాలే తెరవలేదు. ఈ మున్సిపాలిటీలలోని అన్ని వార్డులను అధికార టీఎంసీనే కైవసం చేసుకుంది. భాజపా నేత సువేందు అధికారి కంచుకోట అయిన కంతి మున్సిపాలిటీని సైతం టీఎంసీ స్వాధీనం చేసుకుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సువేందు అధికారి కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఈ ఫలితం.. సువేందుకు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Hamro party West Bengal
భాజపా, కాంగ్రెస్ డీలా పడ్డ వేళ.. ఓ సరికొత్త రాజకీయ పార్టీ అనూహ్య ఫలితాన్ని సాధించింది. కొత్తగా ఏర్పాటైన హమ్రో పార్టీ.. డార్జీలింగ్ మున్సిపాలిటీని దక్కించుకుంది. 'గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్' మాజీ నేత, స్థానిక రెస్టారెంట్ యజమాని అజోయ్ ఎడ్వర్డ్స్ ఈ పార్టీని స్థాపించారు. డార్జీలింగ్లో ఆధిపత్యం సాగించే గూర్ఖా జన్ముక్తి మోర్చా, టీఎంసీ, భాజపాలను ఓడించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.
సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి తహెర్పుర్ మున్సిపాలిటీలో విజయం సాధించింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఏ పార్టీకి తగిన మెజారిటీ రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఎన్నికలకు ముందే ఓ స్థానాన్ని టీఎంసీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
Mamata Banerjee Bengal municipal polls
మమత ఖుషీ!
మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. అనూహ్య మెజారిటీతో గెలిపించినందుకు.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విజయంతో తమ బాధ్యత పెరిగిందన్నారు. మరింత అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి సుస్థిరతలు పెంపొందించి, అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలని పిలుపునిచ్చారు.
అయితే, ఎన్నికల వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా జరిగిందని భాజపా మండిపడింది. అయితే, ఓటమికి సాకులు చెప్పేందుకే విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.
ఇదీ చదవండి: కోర్టులోనే జడ్జిని పొడిచిన ఆఫీస్ అసిస్టెంట్.. కారణం తెలిస్తే..!