Bangalore rain: భారీ వర్షాలు కర్ణాటకను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరదముంపులోనే చిక్కుకున్నాయి. కొరమంగళ ప్రాంతంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
![Waterlogging in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ani-20220905024149_0509newsroom_1662350035_664.png)
'భారీగా వర్షం కురిసింది. ఉదయం లేచి చూసేసరికి మోకాళ్ల లోతు వరకు వరద నీరు వచ్చేసింది. నా ఇంటి బేస్మెంట్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచి నీటిని తోడే పనిలో ఉన్నా. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది. ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేదు. రోడ్డు నిర్మించిన సమయంలో డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోలేదు. దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది మహిళలు నీటిలో జారి పడుతున్నారు' అని స్థానికులు చెప్పారు.
![Waterlogging in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ani-20220905024231_0509newsroom_1662350035_150.png)
వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు కాపాడారు. మరాతహళ్లి-సిల్క్ బోర్డ్ జంక్షన్ రోడ్డులో భారీగా వరద నీరు నిలిచిపోగా ఓ వ్యక్తి అందులో చిక్కుకున్నాడు. అతడిని పోలీసులు చాకచక్యంగా రక్షించారు. మరోవైపు, వరద ముంపు వల్ల బెంగళూరులోని ఐటీ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీ ఆఫీసుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని అమెజాన్, విప్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. వర్షం కారణంగా తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది.
![Waterlogging in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16286147_891_16286147_1662355973053.png)
ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. ఐటీ కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేసి మాట్లాడతామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు తలెత్తిన నష్టానికి పరిహారం ఇచ్చే అంపైనా చర్చిస్తామని చెప్పారు. బెంగళూరులో సెప్టెంబరు 9 వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత జులైలోనూ కర్ణాటకను భారీ వర్షాలు కుదిపేశాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
![Waterlogging in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16286147_bengaluru-2.jpg)
ఇదీ చదవండి: