Watchman beaten in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీగార్డును చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. దెబ్బలకు తాళలేక బాధతో విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. సిపత్ పట్టణానికి చెందిన మహవీర్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే కొంతమంది యువత మహవీర్‌ను ఓ నిర్మానుష్య ప్రాంతంలోని తీసుకెళ్లి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. వదిలిపెట్టాలని ఏడుస్తూ మొరపెట్టుకున్నా, బాధతో విలవిల్లాడినా వారు కరుణించలేదు.
అయితే ఈ ఘటనను చూసిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డును రక్షించారు. దాడికి పాల్పడినవారిలో నలుగురిని అరెస్టు చేసి, మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు సిపత్ ఎస్‌హెచ్‌ఓ వికాస్ కుమార్ వెల్లడించారు. మహవీర్ తమ ఇంట్లో దొంగతనానికి చొరబడ్డాడని, అందుకే దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు మనీశ్ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: కన్నబిడ్డపై కర్కశత్వం.. మెడకు టవల్ చుట్టి దారుణంగా కొట్టిన తండ్రి