Visually Impaired Student Got A Gold Medal: చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలమని నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్ కుమార్ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా నిరాశ పడకుండా చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక స్కోరు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.
అన్విత్ ఆరో తరగతిలో ఉండగా.. తన రెండు కళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి తల్లి చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి తరగతిలోనూ మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపిలో చదువుకున్న అన్విత్.. తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితోపాటు సహచర విద్యార్థులు, అధ్యాపకులు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్.. పదో తరగతిలో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో బంగారు పతకాలు సాధించిన అన్విత్.. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు.
"నేను బీఏలో ఈ ఘనత సాధించడానికి అధ్యాపకులు, మిత్రులు చాలా సహాయం చేశారు. ఎంఏలో కూడా అదే సహకారం అందించారు. నాకు మెటీరియల్ అవసరమైనపుడు ప్రొఫెసర్లు ఇచ్చేవారు. పరీక్షల సమయంలో ఇది ఎంతో సహాయం చేసింది."
-అన్విత్ కుమార్, గోల్డ్ మెడలిస్ట్
75 Years Old Woman Done PHD: చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారు మంగళూరుకు చెందిన ఓ వృద్ధురాలు. ఉడుపికి చెందిన ఉషా చడగ 75 ఏళ్ల వయసులో మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 'శ్రీ మధ్వాచార్యుల అద్వితీయమైన జీవస్వభావ వాదం, సర్వశబ్ద వాచ్యత్వానికి సంబంధించిన శ్రీ మధ్వాచార్యుల విశిష్ట సిద్ధాంతాల విమర్శనాత్మక విశ్లేషణ' అన్న అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ వరించింది.
ఉషా చడగ అంతకుముందు త్రివేండ్రంలోని సంతాన పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం సంస్కృత కళాశాలలో చేరారు. సంస్కృత విద్వత్ నేర్చుకున్న ఆమె.. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుని ఐదేళ్లలో పూర్తి చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో ఉషా పట్టాను అందుకున్నారు.
ఇదీ చదవండి: ఛాయ్ కోసం ట్రైన్నే ఆపేసిన డ్రైవర్