Reactions of YSRCP leaders in Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుచరగణం నాలుక మడతేస్తున్న తీరు.. ఊసరవెళ్లికే రంగులుమార్చడం నేర్పాలా ఉంది. 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత వివేకా హత్యకు గురయ్యారు. మార్చి 15న పులివెందులలో,.. మార్చి 16న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ బయట ప్రతిపక్ష నేత హోదాలో ఆయన జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆయన అనుచరగణం చేస్తున్న ప్రచారాలు.. చూసి నివ్వెరపోవాల్సిన పరిస్థితి. బహుశా ఒకే విషయంలో ఇన్ని మాటలు మార్చటంలో.. ప్రత్యేక రికార్డు ఏదైనా ఉంటే అది ‘జగన్ అండ్ కో’ కే దక్కుతుంది.
నాడు సౌమ్యుడు.. నేడు స్త్రీ లోలుడు.?: వివేకా వ్యక్తిత్వంపై జగన్ అండ్‌కో భిన్నస్వర విన్యాసం! ప్రతిపక్షంలో ఉండగా చిన్నాన్నపై జగన్ చూపిన అభిమానం.. ఇప్పుడు వివేకాహత్యలో వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల ప్రమేయం గురించి సీబీఐ ప్రస్తావించింది మొదలు.. రివర్స్‌లో జగన్ బృందం వివేకాపై రోజులో రకం బురదచల్లుతోంది. అక్రమ సంబంధాలున్నాయని.. సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారనే ప్రచారం చేస్తోంది.
పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీ చేసినప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వంపై.. ఇలా బురద చల్లలేదు. పైగా వివేకాకు.. ఓ ముస్లిం యువతితో సంబంధం ఉందని, 2011లో ఆమెను పెళ్లి చేసుకుని..షేక్ మహ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకున్నారని.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి ప్రకటించడం నివ్వెరపరుస్తోంది. ముస్లిం మహిళ ద్వారా పుట్టిన అబ్బాయిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా అనుకుంటే.. మొదటి భార్య సౌభాగమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఒప్పుకోలేదేదని, అందుకే మనస్పర్థలంటూ.. అవినాష్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు.
జగన్ కుటుంబ పత్రిక సాక్షిలోనూ అవే ఆరోపణలను.. పతాక శీర్షికల్లో అచ్చేస్తున్నారు. చిన్నాన్న సౌమ్యుడంటూ.. నాడు కీర్తించిన జగన్.. ఇప్పుడు సొంతపార్టీ నేతలు, కుటుంబ సభ్యులే కించపరిచేలా.. మాట్లాడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు. ఆ ప్రచారాలకు.. తన సొంత పత్రిక సాక్షిలో.. ఎందుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం ఉండదు.
నాడు సీబీఐ.. నేడు 'ఛీ'బీఐ?: వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలోనూ.. జగన్ అండ్ కో.. నాలుక మడతేసింది. వివేకా హత్య కేసు మూలాల్లోకి వెళ్లాలని.. ఒక పద్ధతి ప్రకారం దర్యాప్తు జరగాలంటే సీబీఐకి ఇవ్వాలని.. నాడు జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది నాడు జగన్ కోరిన సీబీఐనే.! కాకపోతే అధికారంలోకి.. వచ్చాక ఆయనకు సీబీఐ నచ్చలేదు. బాబాయి హత్యపై.. సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ అక్కర్లేదనుకున్నారు. హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా సిట్ వేశారు. కానీ.. కేసు అడుగుకూడా ముందుకు కదల్లేదు.
పైగా వివేకా ఇంట్లో సాక్ష్యాధారల సేకరణలో.. నిర్లక్ష్యం వహించారంటూ టీడీపీ ప్రభుత్వం అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్ చేస్తే.. జగన్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చిందనే.. అపవాదు మూటగట్టుకున్నారు. ఇవన్నీ చూసిన వివేకా కుమార్త సునీత కోర్టుకు వెళ్లి.. సీబీఐ విచారణ సాధించుకున్నారు. జగన్ అప్పట్లో డిమాండ్ చేసినట్లే సీబీఐ కేసు మూలాల్లోకి వెళ్తుంటే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతోంది. దర్యాప్తు దారి తప్పుతోందంటూ.. ప్రచారం చేస్తోంది. ఏకంగా అధికారంలో లేని చంద్రబాబు చెప్పినట్లు సీబీఐ విచారణ నడుస్తోందని.. అర్థంలేని ఆరోపణలు చేస్తోంది.
నాడు లేఖ కల్పితం!.. నేడు లేఖ దాచడం తప్పు!: వివేకా హత్య తర్వాత.. గదిలో లభ్యమైన లేఖపై నాటికీ,నేటికీ వచ్చిన మార్పు.! ఆ లేఖ కల్పిత కుట్రగా నాడు జగన్ తేల్చిపారేస్తే.. ఇప్పుడు ఆ లేఖను పరిగణలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పుంటున్నారు అవినాష్‌రెడ్డి.! పైగా వివేకాతో బలవంతంగా లేఖ రాయించామని.. అప్రూవర్ మారిన దస్తగిరే చెప్తున్నారు కదా అని అవినాష్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.! మళ్లీ అదే నోటితో.. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక కుట్రని వాదిస్తున్నారు. ఇలా సీబీఐ కేసును క్లైమాక్స్‌కు తెచ్చేసిందన్న ప్రతీసారీ.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటలకు భిన్నమైన వాదనలు ప్రచారంలో పెడుతోంది జగన్ అండ్ కో.
ఇవీ చదవండి: