Uttar Pradesh Honour Killing : ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్యాయత్నం కలకలం రేపింది. కన్న కూతురికి నిప్పంటించి చంపేయాలని ప్రయత్నించాడు ఓ కసాయి తల్లి. హాపుడ్ జిల్లా బహదుర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాదా ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తమకు నచ్చని యువకుడితో యువతి రిలేషన్షిప్లో ఉండటం వల్లే హత్య చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. యువతి తల్లి, సోదరుడు.. ఆమెను పొలంలోకి తీసుకెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.
Attempt To Burn Daughter Alive UP : స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. యువతి రిలేషన్షిప్ గురించి తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. కోపంతో యువతిపై దాడి చేశారు. పొలంలోకి లాక్కెళ్లి పెట్రోల్ పోశారు. అనంతరం ఆమెకు నిప్పంటించారు. బాలిక గట్టిగా కేకలు వేస్తూ సహాయం కోసం ప్రార్థించింది. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. 'దూరం నుంచి మాకు యువతి అరుపులు విపించాయి. వెంటనే పరిగెత్తుకుంటూ పొలం వైపు వెళ్లాం. అప్పటికే యువతి మంటల్లో కాలిపోతూ ఉంది. తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఘటనాస్థలికి పోలీసులు చేరుకోవడాన్ని చూసి.. బాధితురాలి తల్లి, సోదరుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ మేం వారిని అడ్డుకొని పోలీసులకు అప్పగించాం' అని స్థానికులు వివరించారు.
యువతి తల్లిని, సోదరుడిని కస్టడీలోకి తీసుకున్నామని హాపుడ్ అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. 'బాధితురాలిని దగ్గర్లోని వైద్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించాం. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వేరే ఆస్పత్రికి వైద్యులు సిఫార్సు చేశారు. విచారణ పూర్తయ్యాకే అన్ని వివరాలు తెలుస్తాయి' అని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.
సగం కాలిన బాలిక మృతదేహం లభ్యం..
12 ఏళ్ల బాలిక మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమైంది. ఈ ఘటన బిహార్.. పశ్చిమ చంపారన్ జిల్లా కేంద్రం బేతియాలోని షికార్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న ఓ 12 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఆమె బంధువులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా తగులబెట్టారు. దీనిపై స్థానిక ఇన్ఫార్మర్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సగం కాలిన స్థితిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.