ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మేరఠ్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఓ హత్య కేసులో జైలులో ఉన్న అనిల్.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడని.. అనంతరం తనపై ఉన్న కేసుల్లోని సాక్షులను బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్టు చేయడానికి వెళ్లిన ఎస్టీఎఫ్ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా.. గ్యాంగ్‌స్టర్ అనిల్ మృతిచెందాడు. అనిల్ దుజానాపై 18 హత్య కేసులతో పాటు మొత్తం 62 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
అనిల్ తన గ్యాంగ్ సభ్యులను కలవడానికి మేరఠ్‌లోని ఓ గ్రామానికి వెళ్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఫాలో అయ్యారు. పోలీసులను గమనించిన అనిల్.. తాను ప్రయాణిస్తున్న ఎస్యూవీ వేగం పెంచాడు. అనంతరం ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో యూపీ ఎస్టీఎఫ్ అడిషనల్ ఎస్పీ బ్రిజేశ్ సింగ్ నేతృత్వంలోని బృందం అతడిని చుట్టుముట్టింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు నేరస్థుడు అనిల్. ఆ తర్వాత పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగగా.. అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలం నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కారులో అనిల్ ఒక్కడే వచ్చాడా? లేక.. తన గ్యాంగ్ సభ్యులెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సైకిల్ దొంగ.. కట్ చేస్తే కరుడుగట్టిన క్రిమినల్
యూపీలోని గౌతమ్‌బుద్ధ్ నగర్ బాదల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుజానా గ్రామానికి చెందినవాడు అనిల్ నాగర్. చిన్నతనంలోనే సైకిల్ దొంగతనం ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. అక్కడ తన పేరును అనిల్ దుజానాగా మార్చుకున్నాడు. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన వారు ఫలానా వాళ్ల నుంచి తమకు ప్రాణహాణి ఉందని చెబితే.. వాళ్లను చంపేసేవాడు. కొద్దికాలం తర్వాత దిల్లీ ఎన్సీఆర్కు మకాం మార్చాడు. పశ్చిమ యూపీలో భూకబ్జాలు, దోపిడీ సహా రకరకాల నేరాలలో నిపుణుడిగా మారాడు. అనిల్ వయస్సు పెరిగేకొద్దీ.. యూపీలో గ్యాంగ్‌వార్ పెరిగింది.
అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య..
ఇటీవల గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉతర్త్ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్, అష్రఫ్‌లను.. జైలు నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా జర్నలిస్టుల్లా వచ్చిన దుండగులు వారిపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతీక్, అతని సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరు హత్యకు గురుకావడానికి రెండు రోజుల ముందు అతీక్ కుమారుడు అసద్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.