యువకుడి కడుపులో నుంచి 56 బ్లేడు ముక్కలను బయటకు తీశారు వైద్యులు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు.. ఈ అరుదైన ఆపరేషన్ చేశారు. యశ్పాల్సింగ్ అనే యువకుడి కడుపులో ఈ బ్లేడ్ ముక్కలను గుర్తించారు వైద్యులు. అనంతరం విజయవంతంగా ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు.
యశ్పాల్ సింగ్.. జాలోర్ జిల్లాలోని సంచోర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతడు బాలాజీ నగర్లో మరో నలుగురు మిత్రులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అతడు నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం యశ్పాల్ మిత్రులంతా విధులకు వెళ్లగా.. అతనొక్కడే రూంలో ఉన్నాడు. వారు వెళ్లిన ఓ గంటసేపటికి యశ్‌పాల్‌కు రక్తపు వాంతులయ్యాయి. తీవ్ర కడుపు నొప్పి సైతం వచ్చింది. దీంతో తన మిత్రులకు ఫోన్ చేశాడు యశ్పాల్. తన ఆరోగ్యం బాగాలేదని వారికి చెప్పాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన యశ్పాల్ మిత్రులు.. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాధితుడ్ని ముందుగా దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి మరింత విషమించిన కారణంగా.. మరో ఆసుపత్రికి తీసుకువెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో నగరంలోని మెడ్‌ప్లస్ ఆసుపత్రికి యశ్‌పాల్‌ను తరలించారు. అతడికి ఎక్స్‌రే సహా మిగతా వైద్య పరీక్షలు చేసిన మెడ్‌ప్లస్ ఆసుపత్రి డాక్టర్లు.. కడుపులో 56 బ్లేడ్ ముక్కలను గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి.. విజయవంతంగా వాటిని బయటకు తీశారు. దీంతో యువకుడి ప్రాణాలను కాపాడారు.
![aUnique Surgery of young man Doctors removed 56 blades in young man stomach](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jlr-01-yuvak-bled-avb-rj10031_14032023140201_1403f_1678782721_642.jpg)
యువకుడిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతడి ఆక్సిజన్ లెవల్స్ 80 వద్ద ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టమని చెప్పిన వైద్యులు.. విజయవంతంగా చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం యువకుడు పరిస్థితి బాగానే ఉందన్నారు. డాక్టర్ ప్రతిమ వర్మ, డాక్టర్ పుష్పేంద్ర, డాక్టర్ ధవల్ షా, డాక్టర్ షీలా బిష్ణోయ్, డాక్టర్ నరేష్ దేవాసి రామ్‌సిన్, డాక్టర్ అశోక్ వైష్ణవ్ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. అయితే యువకుడి కడుపులోకి ఈ బ్లేడ్లు ఎలా వచ్చాయనేది మాత్రం వారు వెల్లడించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి వివరాలు చెప్పలేదు.
![Unique Surgery of young man Doctors removed 56 blades in young man stomach](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jlr-01-yuvak-bled-avb-rj10031_14032023140201_1403f_1678782721_587.jpg)
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దంతం..
కొద్ది రోజుల క్రితం గుజరాత్ వైద్యులు కూడా ఓ అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఊపిరితిత్తుల్లో దంతం ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి.. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఉపశమనం కల్పించారు. ఈ ఆపరేషన్‌కు రెండు గంటల సమయం పట్టింది. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన 52 వ్యక్తికి ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఈ ఘటన సూరత్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి