NEAT 3.0: నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ(NEAT) మూడో విడత కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. 12 లక్షల NEAT సాంకేతిక విద్య ఉచిత కోర్సుల కూపన్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటి విలువ రూ.253.72 కోట్లు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఇస్తున్న నూతన సంవత్సర కానుక అని ప్రధాన్ పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈబ్ల్యూఎస్ విద్యార్థులకు సాంకేతిక కోర్సులను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కూపన్ల సాయంతో సంబంధిత వెబ్సైట్లోకి విద్యార్థులు ఉచితంగా లాగిన్ అయ్యి, కావాల్సిన కోర్సు నేర్చుకోవచ్చు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఓకే వేదిక ద్వారా అనేక సాంకేతిక కోర్సులు నేర్పించేందుకు NEATను తీసుకొచ్చింది కేంద్రం. ఇది సాంకేతిక విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని భావిస్తోంది. డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు NEAT దోహదపడుతుందని, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. ప్రపంచ స్థాయిలో అవకాశాలను కల్పిచేందుకు ఉపయోగపడుతందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐసీటీఈతో కలిసిరావాలని సాంకేతిక సంస్థలను కేంద్రమంత్రి కోరారు. NEATలో 58 ప్రపంచ సంస్థలు, భారత అంకుర సంస్థలు మొత్తం 100 కోర్సులను అందిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లో రూపొందించిన సాంకేతిక పుస్తకాలను ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా పరీక్షలకు అనుమతి