లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రికి కాలేయాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడింది ఓ యువతి. తండ్రి ప్రాణాలు నిలిపేందుకు తన కాలేయంలో 60 శాతాన్ని ఇచ్చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగింది. ఉంచపుల్ శిపపురానికి చెందిన విపిన్ కాంద్పాల్.. 1988 నుంచి 2009 వరకు సైన్యంలో పనిచేశాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాడు. ఈ క్రమంలోనే ఆయనకు కాలేయం దెబ్బతింది. స్థానిక వైద్యులను సంప్రదించగా.. రిషికేశ్ ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం దిల్లీకి వెళ్లాలని సూచించారు. దీంతో విపిన్.. దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, బిలియరీ సైన్సెస్‌ను ఆశ్రయించారు. విపిన్ కాలేయాన్ని పరిశీలించిన వైద్యులు.. అవయవ మార్పిడి చేయాలని చెప్పారు. దాత కోసం ప్రయత్నించాలని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు విపిన్‌ను.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించింది. మేదాంత వైద్యులు సైతం కాలేయ మార్పిడి తప్పదని చెప్పారు. దీంతో విపిన్ భార్య కాలేయ దానానికి ముందుకొచ్చారు. అయితే, ఆమె లివర్‌కు కొవ్వు అధికంగా ఉందన్న కారణంతో కాలేయ మార్పిడి సాధ్యం కాలేదు. విపిన్ కుమారుడేమో బరువు తక్కువగా ఉన్నాడు. విపిన్ కూతురు ప్రియా తివారికి వివాహం కాగా.. పలు సమస్యల వల్ల ఆమె దానం చేయలేకపోయారు. దీంతో ఆయన చిన్నకూతురు పాయల్ కాంద్పాల్.. పెద్ద మనసు చేసుకుంది. ఆప్తమాలజీ(నేత్ర శాస్త్రం) చదువుతున్న పాయల్.. కాలేయ దానానికి ముందుకొచ్చింది. భవిష్యత్‌లో ఏదైనా సమస్యలు రావొచ్చని వైద్యులు, సన్నిహితులు చెప్పినా.. దానంపై వెనకడుగు వేయలేదు. స్వచ్ఛందంగా తన కాలేయంలోని 60 శాతం భాగాన్ని తండ్రికి దానం చేసింది.
చివరకు ఆపరేషన్ సక్సెస్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. పాయల్ చాలా కాన్ఫిడెంట్ ఉందని, అందువల్ల వేగంగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇన్నేళ్లు తనను పెంచిన తండ్రి కోసం అవయవదానం చేయడం గర్వంగా ఉందని పాయల్ చెబుతోంది. తండ్రి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటుందని అంటోంది. అవయవదానానికి ముందుకొచ్చిన పాయల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.