TTD Angapradakshina Tickets for December Online Today: కోరిన కోర్కెలు తీర్చే దైవంగా.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం.. తెలుగు రాష్ట్రాల సహా దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. అయితే.. స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు కూడా అధికంగా ఉంటారు. శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయడం అంటే మాటలా .. ఆ అనుభూతిని వర్ణించడానికి కూడా మాటలు చాలవు అని భక్తులు అంటారు. అయితే మొదటిసారిగా అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకోవడం వల్ల అంగప్రదక్షిణ సులభంగా చేయవచ్చు.. అంతే కాకుండా అంగప్రదక్షిణ టికెట్లు ఎక్కడ ఇస్తారు..? ఆలయానికి ఎప్పుడు ఏ సమయంలో చేరుకోవాలి..? ఏ విధమైన నియమాలు పాటించాలి? అనేవి ఈ కథనంలో తెలుసుకుందాం.
TTD Released December Month Tickets: కాగా డిసెంబర్ నెలకు సంబంధించిన పలు సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. తాజాగా ఈరోజు డిసెంబర్ నెలలో అంగప్రదక్షిణ టకెట్లను ఆన్లైన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. అలాగే 11 గంటలకు దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. మరోవైపు రూ.300 దర్శనం టిక్కెట్లను ఈ నెల 25న (సోమవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 24న విడుదల కావాల్సి ఉండగా, ఈ నెల 24 ఆదివారం కావడంతో దానిని 25వ తేదీకి మార్చారు. అలాగే వసతి గదులకు సంబంధించి కూడా ఈ నెల 26, 27 తేదీల్లో విడుదల చేయనున్నారు. భక్తులు దర్శనం టిక్కెట్లు, వసతి గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ..!
అయితే.. అంగప్రదక్షిణ చేసే భక్తులు ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంగప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద దుస్తులతోనే మూడు మునకలు వేసి అలాగే తడి వస్త్రాలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్లాలి. రాత్రి.. ఒంటి గంట.. కనుక ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం.. సెక్యూరిటీ భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లోకి ప్రవేశం ఉంటుంది.
వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ మొదలైన తరవాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతినిస్తారు. దాదాపు తెల్లవారుజాము 3 గంటల సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణ కోసం పంపుతారు. తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. తర్వాత భక్తులను స్వామివారి వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెడతారు. స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి దగ్గరకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులను వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారు. ఇంతలో శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది. దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే అంగప్రదక్షిణ భక్తులకు అనుమతిస్తారు.
TTD Tirumala Seva Tickets for November : తిరుమల శ్రీవారి సేవాటికెట్లు.. నేడే విడుదల!
సంప్రదాయ దుస్తులు: అయితే అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. చీరలు, లంగా వోణీ వంటివి ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా ధరించాల్సి ఉంటుంది. షార్ట్, ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్, చొక్కా, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరించి వెళ్లే భక్తులను అంగప్రదక్షిణకు అనుమతించరు.
ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి??: ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) చేరుకోవాలి. అప్పుడు ప్ర్దక్షిణ పూర్తి అవుతుంది. ప్రదక్షిణలు చేయడం (దొర్లడం)లో ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు.. కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు.
అంగప్రదక్షిణ టిక్కెట్: స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందొచ్చు. మొబైల్ నెంబర్‌తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, 1 ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు.