అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ వద్ద విషాదకర ఘటన జరిగింది. మెక్సికో వెళ్లిన గుజరాతీ కుటుంబం ట్రంప్ గోడ దూకి అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు యత్నించగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతడి భార్య, మూడేళ్ల కుమార్తె గాయాలపాలయ్యారు. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గుజరాత్ నుంచి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళుతుంటారు. అక్కడి నుంచి అక్రమంగా ఇతర దేశాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇటీవల గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన కలోల్ కుటుంబం కూడా ఇదే రీతిలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిందేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 30 అడుగుల ఎత్తులో ఉన్న ట్రంప్ గోడను దూకబోయి.. కుటుంబ యజమాని బ్రిజేష్ కుమార్ మృతి చెందాడు. అతని భార్య, మూడు సంవత్సరాల వయసున్న కుమార్తె గాయపడ్డారు.
ఈ విషయం గురించి గాంధీనగర్ కలెక్టర్ భరత్ జోషి మాట్లాడుతూ.. "బ్రిజేష్ కుమార్ తన కుటుంబంతో దేశం విడిచి వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరంతా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బ్రిజేష్ మృతి చెందాడు. అతని కుటుంబం గాయాలపాలైంది. ఓ ఏజెంట్ ద్వారా అమెరికా వెళ్లిన ఈ కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందింది. బ్రిజేష్ గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన కలోల్ జీఐడీసీలో పనిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.
మెక్సికో నుంచి శరణార్థుల రాకను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిహద్దులో భారీ గోడను నిర్మించారు. దానినే ట్రంప్ గోడగా పిలుస్తుంటారు.