ఉత్తరాఖండ్.. యాత్రికులకు స్వర్గధామం. అక్కడి ప్రకృతి సోయగాలు.. భువిపై దివిని తలపిస్తాయి. అందుకే ఎప్పుడెప్పుడు ఛార్‌ధామ్ యాత్ర చేపడదామా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో కొండలపై పరుచుకున్న పూల అందాలను ఆస్వాదిద్దామా అని.. పర్యటకులు ఊవిళ్లూరతారు. అక్కడి నుంచి సిక్కుల పుణ్యక్షేత్రం హేమ్‌కుండ్ సాహిబ్‌కు చేరే క్రమంలో పారే సెలయేళ్లు మనసును పులకరింపజేస్తాయి. వీటన్నింటినీ ఏడాదిగా దూరం చేసింది కరోనా. అయితే ఈ జులై 1న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు దేశీయ, విదేశీ యాత్రికులను నంద దేవి బయోస్పియర్ రిజర్వ్ అనుమతించడం వల్ల అక్కడ మరోసారి యాత్రికుల తాకిడి పెరిగింది.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లాలంటే మాత్రం యాత్రికులు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాల్సిందేనని ఆదేశాలిచ్చారు అధికారులు. కరోనా వ్యాప్తి కారణంగా నగరాల్లో తిరగడం కన్నా ప్రకృతి ఒడికి చేరుకోవడానికే పర్యటకులు మొగ్గుచూపుతున్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేసే ట్రెక్కింగ్ మరచిపోలేదని అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు.
"ఫ్లవర్స్ వ్యాలీ గురించి చాలా విన్నాను. కానీ ఎప్పుడూ రావడానికి వీలుపడలేదు. కొవిడ్ ఉండటం వల్ల నగరాల్లో కన్నా ప్రకృతి ఒడికి వస్తే బాగుటుంది అనిపించింది. రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి. మంచి ఆహారపానీయాలున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లలో దొరికే లగ్జరీ ఉండకున్నా, ఇక్కడి రుచి, ఏర్పాట్లు అదిరిపోయాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేసిన ట్రెక్కింగ్ ఎంతో ఆనందాన్నిచ్చింది."
-సమీర్, ముంబయికి చెందిన యాత్రికుడు
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం హేమ్‌కుండ్ సాహిబ్.. కరోనా కారణంగా ఇప్పటికీ మూతబడే ఉంది. అక్కడికి చేరుకునే మార్గాన్ని మాత్రం అధికారులు తెరిచే ఉంచారు. దీంతో ఇక్కడి పుణ్య నదిలో స్నానామాచరించడానికి యాత్రికులు వస్తూనే ఉన్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అందాలను ఆస్వాదించడానికి వచ్చేవాళ్లు హేమ్కుండ్కూ వెళ్తున్నారు. బయటి నుంచే గురుద్వార దర్శనం చేసుకుంటున్నారు.
హేమ్‌కుండ్ సాహిబ్ సహా లోక్‌పాల్ లక్ష్మణ్ మందిర్ కూడా మూతబడే ఉంది. దీంతో దైవదర్శనం చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు భక్తులు. కరోనా కారణంగా ఛార్‌ధామ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపైనే యాత్రికులు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి: హిమపాతంతో భూతల స్వర్గాన్ని తలపిస్తున్న ఉత్తరాఖండ్