పని పట్ల నిబద్ధత, అంకిత భావంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఓ పోస్టు మాస్టర్. ఓ బామ్మకు వృద్ధాప్య పింఛను అందించేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కొండలు ఎక్కి, అడవుల్లో ప్రయాణించి.. నదిని దాటుకుని ఆమె వద్దకు వెళుతున్నారు. ఆరు నెలల నుంచి వృద్ధురాలికి పింఛను డబ్బులు అందజేసి, ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నారు తమిళనాడు తిరునెల్వెలి జిల్లాకు చెందిన క్రీస్తురాజా.
జిల్లాలోని కారైయ్యార్ డ్యామ్‌కు ఎగువన.. కాలంకడ్ ముందంతురై టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఇంజిక్కుళి పరిధిలోని గిరిజన తండాలో కుట్టియమ్మల్ అనే 105 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. కుట్టియమ్మల్కు వచ్చే రూ.1,000 పింఛను అందజేసేందుకు.. క్రీస్తురాజా దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. అయితే.. ఈ సారి క్రీస్తురాజాతో పాటు ఈటీవీ భారత్ కూడా ఆయన వెంట బయల్దేరింది.
సొంత ఖర్చుతో..
ఈ ప్రయాణంలో క్రీస్తురాజా రానుపోను దాదాపు 8 కిలోమీటర్లు నదిలో బోటుపై ప్రయాణిస్తారు. బోటుకు కావాల్సిన డీజిల్ కోసం సొంతంగా రూ.500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడైనా నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పుడు బోటులో కాకుండా మరో మార్గంలో ప్రయాణించి, వృద్ధురాలి వద్దకు చేరుకుంటారు. అలా వెళ్లినప్పుడు ఇంత కంటే రెట్టింపు దూరం క్రీస్తురాజా ప్రయాణించాల్సి ఉంటుంది.
క్రీస్తురాజే ఆమె వద్దకు..
ఆరు నెలల క్రితం తిరునెల్వెలి జిల్లా కలెక్టర్ వి విష్ణు.. ఇంజిక్కుళి ప్రాంతానికి వచ్చినప్పుడు.. తనకు పింఛను ఇప్పించాలని కుట్టియమ్మల్ వేడుకుంది. స్పందించిన కలెక్టర్.. ఆమెకు వెంటనే పింఛను మంజూరు చేశారు. అయితే.. ఆ పింఛను డబ్బులు తీసుకునేందుకు దగ్గర్లో ఏటీఎం వంటి సదుపాయాలు లేవు. దీంతో పాపనాశమ్ తపాలా కార్యాలయంలో పని చేసే క్రీస్తురాజా.. పోస్టల్ మనీయార్డర్లో వచ్చే డబ్బులను అందజేసేందుకు ఆమె వద్దకు వెళ్తున్నారు.
మధ్యాహ్నం వరకు..
అల్పాహారం, మధ్యాహ్న భోజనం తీసుకుని, ఉదయాన్నే కుట్టియమ్మల్ ఉండే చోటుకు బయల్దేరతారు క్రీస్తురాజా. నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఓ చోట ఆగి అక్కడ అల్పాహారాన్ని తింటారు. అనంతరం అక్కడి నుంచి అడవులు, కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ... మధ్యాహ్నం వరకు ఇంజిక్కుళి ప్రాంతానికి చేరుకుంటారు. కుట్టియమ్మల్కు డబ్బులు అందించి.. మళ్లీ దీపాల వేళకు తన ఇంటికి చేరుకుంటారు. ఇందుకోసం ఓ రోజు మొత్తం సమయాన్ని ఈయన వెచ్చిస్తారు. అయితే.. ఈ సుదీర్ఘ యాత్రను భారంగా కాకుండా చాలా సంతోషంగా భావిస్తున్నానని చెబుతున్నారు క్రీస్తురాజా.
"పింఛను సొమ్మును వృద్ధురాలికి అందజేయడాన్ని నేనెప్పుడూ భారంగా భావించలేదు. అయితే.. పనిదినాల్లో ఈ కొండలను దాటుతూ వెళ్లటమే అసలు సమస్య. అందుకని ఆదివారం లేదా సెలవు రోజుల్లో మాత్రమే ఈ డబ్బులను అందజేయడానికి వెళ్తాను. కుట్టియమ్మల్కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లడానికి నా కుటుంబం కూడా ఎంతో తోడ్పాటునందిస్తోంది. కుట్టియమ్మల్కు డబ్బులు ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉంటుంది."
-క్రీస్తురాజా, పోస్టుమాస్టర్
క్రీస్తురాజా తన కోసం డబ్బులు తెచ్చిన రోజు.. కట్టియమ్మల్ మోముపై చిరునవ్వులు విరబూస్తాయి. అంతదూరం ప్రయాణించి వచ్చిన ఆయనను ఎంతో అభిమానంతో కుట్టియమ్మల్ ఆదరిస్తుంది. ఆయనకు కాఫీ లేదా ఏదైనా ఆహారాన్ని అందజేయాలని ప్రయత్నిస్తుంది. అయితే.. క్రీస్తురాజా మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు.
ఇదీ చూడండి: ఈ బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!
ఇదీ చూడండి: ఆ ఐఏఎస్ టాపర్స్ జంట విడిపోయింది!