No VIP break darshan Allowed During Brahmotsavams in Tirumala: తిరుమలలో జరిగే జంట బ్రహ్మోత్సవాల్లో (వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు) వీఐపీ బ్రేక్ దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. బుధవారం తిరుమల ఆలయం ఎదుట బ్రహ్మోత్సవం బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆయన విడుదల చేశారు.
శ్రీవారి వాహన సేవల్లో మెరుగైన దర్శనం, గదులు, అన్నప్రసాదాలు, లడ్డూలు, సామాన్య భక్తులకు భద్రత కల్పించేందుకు టీటీడీ అన్ని విధాలా కృషి చేస్తుందని భూమన తెలిపారు. అలాగే.. సెప్టెంబరు 18న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించే జంట బ్రహ్మోత్సవాలకు టీటీడీలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 మధ్య, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 మధ్య నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
Tirumala Brahmotsavalu : సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. కానీ శ్రావణ అధికమాసం కారణంగా ఈ సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం నిర్వహిస్తారని.. ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని స్పష్టం చేశారు. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 19వ తేదీన గరుడ వాహనం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీటీడీ సభ్యులు ప్రమాణ స్వీకారం:
Oath as TTD Trust Board Members: ఇదిలావుండగా.. మరోవైపు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ సహా మరో ఆరుగురు సభ్యులు బుధవారం తిరుమల ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా గర్భగుడి వద్దకు వచ్చిన సుధీర్‌కుమార్‌కు.. మహా ద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సుధీర్ కుమార్.. వెంకటేశ్వర స్వామి, వకుళ మాత, విమాన వెంకటేశ్వర స్వామి, శ్రీ భాష్యకర్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందించి శ్రీవారి ఫొటోలను అందజేశారు. కాగా, బోర్డు సభ్యులుగా కరికాల వలవెన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఎక్స్ అఫీషియో, ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి, బాలసుబ్రమణ్యం ఫళణిస్వామి, ఆర్ వెంకట సుబ్బారెడ్డి, సిద్దవటం యానాదయ్య, సుధీర్ కుమార్తో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రమాణం చేయించారు.