దొంగను పట్టుకునేందుకు వెళ్లిన రైల్వే పోలీసులకు నిందితుడి కుటుంబ సభ్యులు చుక్కలు చూపించారు. ఇంటికి వచ్చిన పోలీసులపై దాడికి తెగబడ్డారు. నిందితుడి భార్య రాళ్లు రువ్వగా, అతడి కుమారుడు.. పోలీసులపైకి పెంపుడు కుక్కను వదిలాడు. అనంతరం పోలీసులందరినీ ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన బిహార్ పట్నాలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో జరిగింది.
అసలేమైందంటే?
బిహార్‌లోని భోజ్పుర్కు చెందిన ముఖేశ్ కుమార్ పాండే దిల్లీలోని ఒక బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నాడు. ఆరాలోని బంధువుల ఇంట్లో పెళ్లికి తన కుటుంబసభ్యులతో హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో మగధ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా.. వారి లగేజ్‌ను దొంగల ముఠా కాజేసింది. అందులో రూ.12 లక్షల విలువైన నగలు ఉండడం వల్ల ముఖేశ్ కుటుంబ సభ్యులు వాపోయారు. కాన్పుర్‌లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసింది పుల్వారీ షరీఫ్‌కు చెందిన శ్రీ వాత్సవ గ్యాంగ్‌లోని సభ్యుడని తేల్చారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలోనే వీరిపై దాడి జరిగింది.
"మేం స్థానిక పోలీసులతో కలిసి గోపాల్‌పుర్‌లోని నిందితుడు సంజయ్ అగర్వాల్ ఇంటిని తనిఖీ చేయడానికి వెళ్లాం. సంజయ్‌ను అరెస్టు చేస్తున్న సమయంలో, అతని భార్య మాపై రాళ్లతో దాడి చేయడం ప్రారంభించింది. దాడి వల్ల నా తలకు గాయమైంది. ఇంతలో, సంజయ్ కుమారుడు నాపైకి పెంపుడు కుక్కను వదిలాడు."
-అబ్బాస్ హైదర్, ఇన్స్పెక్టర్
అయితే, పోలీసులు మాత్రం పట్టు వదల్లేదు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారందరినీ నిర్బంధించారు. దొంగతనంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు సంజయ్ కుటుంబంపై కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే