Kodi Katthi Case allegations are fabricated: కోడికత్తి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిగ్గు తేల్చింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని, పథకం ప్రకారమే దాడి జరిగిందన్న జగన్ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌కు.. తెలుగుదేశం పార్టీతోనూ, దాడితోనూ సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది. సమగ్ర విచారణ తర్వాతే ఈ విధమైన నిర్ధారణకు వచ్చామన్న ఎన్‌ఐఏ.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని, జగన్ పిటిషన్లు కొట్టేయాలని కోర్టును కోరింది. దీన్ని బట్టి... నాలుగున్నరేళ్లుగా జగన్ చేస్తున్న ప్రచారాలు, తెరపైకి తెచ్చిన కుట్ర సిద్ధాంతాలు పూర్తిగా అవాస్తవమని తేటతెల్లమైంది.
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసుపై ఇప్పటికే కోర్టులో విచారణ మొదలైనందున.. తదుపరి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. అందులో అనేక అంశాలను విస్పష్టంగా ప్రస్తావించింది. జగన్ ఆరోపించినట్లు దాడి వెనుక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్‌ఐఏ వెల్లడించింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం సానుభూతిపరుడు కాదన్న ఎన్‌ఐఏ.. ఈ దాడిలో ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. 2019 జనవరి 12 నుంచి 18వ తేదీ మధ్య నిందితుడిని ప్రశ్నించగా.. జగన్‌పై దాడి ఘటనలో ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని తేలిందని కౌంటర్‌లో పేర్కొంది.
నిందితుడి స్వగ్రామం ఠాణేలంకను సందర్శించామని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామని.. జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో 2017 మార్చి 2న నమోదైన కేసులో శ్రీనివాసరావు ఓ నిందితుడని.. 2017 జులై 30న అభియోగపత్రం కూడా దాఖలైందని కోర్టుకు నివేదించింది. జగన్‌పై దాడికి ముందు శ్రీనివాసరావు ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏయే ప్రాంతాల్లో ఉన్నాడనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసినట్లు వివరించింది. శ్రీనివాసరావు సంబంధీకులను ప్రశ్నించామని, గత చరిత్ర తెలుసుకున్నామని.. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎక్కడా, ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని కుండబద్దలు కొట్టింది.
తనను చంపేందుకు పన్నిన కుట్రలో విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ భాగస్వామి అంటూ జగన్ చేసిన అభియోగం అవాస్తవమని ఎన్‌ఐఏ తేల్చింది. దాడిలో హర్షవర్దన్ పాత్ర, ప్రమేయం లేవని నిర్ధారించింది. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని పేరు హర్షవర్ధన్ చౌదరి అనడం అవాస్తవమని.. ఆయన పూర్తిపేరు తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆయన తెలుగుదేశం నాయకుడని, 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి ఆ పార్టీ టికెట్ ఆశించారన్న జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. కులాన్ని తెలియజేసేలా మోపిన అభియోగాలు, తెలుగుదేశం పార్టీతో పాటు ఒక కులానికి దాడి కుట్రను ఆపాదించేలా హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరి అని పేర్కొంటూ ఎన్‌ఐఏకి జగన్ ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని తేటతెల్లమైంది.
దాడికి కొన్నిరోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న జగన్ అభియోగం కూడా ఎంతమాత్రం నిజం కాదని, సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేస్తున్నట్లు తేల్చింది. విమానాశ్రయంలో సీసీటీవీ దృశ్యాలను పూర్తిగా విశ్లేషించామని ఎన్‌ఐఏ తెలిపింది. జగన్‌పై దాడిలో కుట్ర ఏమైనా ఉందా అనే అంశం సహా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసినట్లు చెప్పింది. ఏపీ పోలీసుల నుంచి కేసు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని పరిశీలించామని.. నిందితుడి ఫోన్‌తోపాటు రెస్టారెంట్‌లో కలిసి పనిచేసిన వారి మొబైల్ ఫోన్ల డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయించామని పేర్కొంది. దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టలేదని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఎన్‌ఐఏ విస్పష్టంగా వివరించింది. అన్నీ పూర్తయ్యాకే అభియోగపత్రం దాఖలు చేశామని.. మొత్తం కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారైన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సాక్ష్యాన్ని కూడా న్యాయస్థానం రికార్డు చేసిందని గుర్తుచేసింది.
కేసు విచారణపై సీఎం జగన్‌కు ఆసక్తి లేదని, కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికే మరింత లోతైన దర్యాప్తునకు ఆదేశించమంటూ పిటిషన్ వేశారని.. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది కౌంటర్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానానికి 20 కిలోమీటర్ల దూరంలోనే జగన్ ఉన్నా కోర్టుకు రావడానికి సుముఖంగా లేరని వివరించారు. సీఎంగా ఉన్నందున కోర్టుకు రావడానికి జగన్ నామోషీగా భావిస్తున్నారని.. ఇది చట్టంపై ఆయనకు ఉన్న గౌరవాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అభియోగపత్రం కూడా దాఖలు చేసిందని.. సాక్షుల విచారణ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని లేదా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని గానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురాలేదని గుర్తుచేశారు. మొదటి సాక్షిగా ఉన్న విశాఖ విమానాశ్రయ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్ విచారణ సందర్భంగా కూడా కొత్త విషయాలేవీ బయటికి రాలేదని... ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పూర్తయిన దర్యాప్తును పక్కన పెట్టాల్సిన అవసరం లేదని నిందితుడి తరపు న్యాయవాది అఫిడవిట్‌లో స్పష్టంచేశారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సాక్ష్యం నమోదుచేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారంటే.. కోర్టులో విచారణ సాగడం జగన్‌కు ఇష్టం లేనట్లు కనిపిస్తోందన్నారు.
కోర్టు ముందు హాజరుకాకుండా తప్పించుకోవడానికే ఆయన పిటిషన్ వేశారని అన్నారు. ఇలాంటి పిటిషన్‌పై కోర్టు ఔదార్యం చూపాల్సిన అవసరం లేదని.... ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ చట్టం ఎప్పుడూ పెద్దదనే సూత్రాన్ని బట్టి జగన్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరడంతో.. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి