Amritpal Singh Arrest : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం పంజాబ్‌లోని మోగా జిల్లాలో అతడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమృత్‌పాల్ అరెస్ట్ నేపథ్యంలో ప్రజలందరు శాంతి భద్రతలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఫేక్ న్యూస్ సృష్టించవద్దని కోరారు. అతడిని అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ భద్రత చట్టం కింద అమృత్ పాల్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అమృత్‌పాల్ అరెస్ట్ కోసం పంజాబ్ పోలీసులు, జాతీయ నిఘా సంస్థలు సంయుక్త కార్యచరణ చేపట్టాయి. అమృత్ అరెస్ట్‌కు ముందు అతడు ఓ గురుద్వారాలో ఉన్నట్లు వీడియో బయటకు వచ్చింది.
అమృత్ పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. అమృత్‌పాల్ పరారైనప్పటీ నుంచి అతడి ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు తీవ్ర గాలింపులు చేపట్టారు. అందు కోసం పంజాబ్ ప్రభుత్వం.. పోలీసులకు సెలవులు సైతం రద్దు చేసింది.
ఎవరీ అమృత్‌పాల్?
ఏడాది క్రితం వరకు అమృత్‌పాల్ అనామకుడు. ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. కనీసం తలపాగా కూడా ధరించకుండా మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను అనుసరించేవాడు. తన బంధువుల రవాణా బిజినెస్‌లో మద్దతుగా ఉండేందుకు దుబాయ్‌కు వెళ్లాడు. సాధారణ యువకుల్లాగే సోషల్ మీడియాలో అధిక సమయం గడిపేవాడు. కానీ, వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు, నటుడు దీప్ సిద్ధూ మరణం.. అమృత్‌పాల్ జీవితాన్ని మార్చేసింది. దీప్ సిద్ధూ అనుచరులకు మార్గదర్శనం చేసే వారు లేకపోయారు. దీంతో ఈ అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకున్నాడు అమృత్‌పాల్. కొద్దిరోజులకే తనను తాను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధినేతగా ప్రకటించుకున్నాడు. మొదట్లో అమృత్‌పాల్ కుటుంబ సభ్యులు ఇందుకు అనుమతించలేదు. కానీ కొద్ది సమయంలోనే అమృత్‌పాల్ బాగా పాపులర్ అయ్యాడు. అతడిపై నిఘా పెట్టిన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. అమృత్‌పాల్‌కు ఐసిస్‌తోనూ సంబంధాలు ఉన్నాయని గుర్తించాయి.