కర్ణాటకలో ఓ వధువు తన వివాహా వేడుకలో హైడ్రామా నడిపించింది. కాసేపట్లో వరుడు.. తన మెడలో మూడుముళ్లు వేయబోతున్న సమయంలో ఉన్నట్టుండి బాంబు పేల్చింది. తనకు పెళ్లి ఇష్టం లేదని, పక్కింటి యువకుడితో ప్రేమలో ఉన్నానని చెప్పింది. అయితే అక్కడితో ఆగలేదు.. కాసేపటికే మళ్లీ ఆ వరుడితోనే పెళ్లికి రెడీ అయింది. కానీ వరుడి కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. ఆమెను మండపం నుంచి గెంటేశారు.
ఇదీ జరిగింది.. మైసూర్‌కు చెందిన యువతికి, కోటేతాలూకా గ్రామానికి చెందిన యువకుడితో ఆదివారం వివాహం ఖరారు చేశారు పెద్దలు. మైసూరులోని విద్యాభారతి మ్యారేజ్ హాల్‌లో ఇరు కుటుంబాలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆదివారం వివాహ తంతు జరుగుతుంటే వధువు హైడ్రామా నడిపింది. వరుడు తాళికట్టే సమయంలో అపస్మారక స్థితికి వెళ్లిపోయినట్లు నటించింది. కాసేపటికే లేచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పక్కింట్లో ఉన్న యువకుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్.. ఆమె ప్రేమికుడు పెళ్లికి ముందు వరుడికి మెసేజ్ చేసి, తనను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. లవర్ మెసేజ్ గురించి వధువును ప్రశ్నించగా.. ఆ మెసేజ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.
అయితే కాసేపటికే ఆ వరుడితోనే ఆమె పెళ్లికి అంగీకరించింది. కానీ, వధువు హైడ్రామా.. వరుడి కుటుంబ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. పెళ్లి లేదు.. గిల్లి లేదు అని ఆ వధువును కల్యాణ మండపం నుంచి గెంటేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. వధువును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: కారులో నవ దంపతులు సజీవ దహనం.. కారణమేంటి?
బీటెక్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలకుపైనే!