Telangana Election Campaign Political Parties Songs : తెలంగాణ చైతన్య పూదోట ఆటా-పాట. నాటి నుంచి నేటి వరకు సామాజిక చైతన్యంలో పాటది ప్రత్యేక స్థానం. కన్నీళ్లోచ్చినా.. కష్టాలొచ్చినా.. సంబరాలు అంబరాన్నంటినా పాటై ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకు పోయింది. తెలంగాణ ఉద్యమానికీ(Telangana Movement) ఊపిరి పోసింది పాట. పోరాటాన్ని ఉరకలెత్తించింది. భావోద్వేగాల్ని తట్టిలేపింది. తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు గడగడపకు తీసుకెళ్లింది.
ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేసే పాటల్నే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ప్రచార అస్త్రం(Political Parties Election Campaign Songs)గా ఎంచుకున్నాయి. పల్లెపదాలతో ప్రజల మనసుల్లోకి సులువుగా చొచ్చుకుపోయేలా పాటల్ని రూపొందించాయి. బీఆర్‌ఎస్ రూపొందించిన రామక్క పాట ఊరువాడ దుమ్మురేపటంతో మిగతా పార్టీలు అదే బాటను అనుసరించాయి. కాంగ్రెస్, బీజేపీలు సైతం రామక్క అంటూ పేరడి పాటలతో బీఆర్‌ఎస్‌కు పోటీగా ప్రజాక్షేత్రంలో మార్మోగిస్తున్నాయి.
Political Parties Songs in Telangana Election Campaign : సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలున్నా.. పాట త్వరగా స్పందింపజేస్తుంది. జనాల మనస్సులోకి సులువుగా చొచ్చుకుపోతుంది. అందుకే నాటి నిజాం కాలం నుంచి నేటి వరకు ప్రజా చైతన్యంలో పాట కీలక భూమికను పోషించింది. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యంగా తోడైంది పాట. జానపదుల నుంచి పుట్టుకువచ్చిన వేలాది పాటలు తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించాయి. పాటకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన పార్టీలు ఎన్నికల్లో ఇదే అస్త్రంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీఆర్‌ఎస్ రూపొందించిన రామక్క పాట తెలంగాణలో దుమ్మురేపుతోంది.
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
BRS Party Election Campaign Song : తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటం, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని పాట రూపంలో కళ్లకు కట్టినట్లు రూపొందించింది. ‘గులాబీల జెండలే రామక్క అంటూ... నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామానికి చెందిన గాయకులు కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయ, సంగీత దర్శకుడు కల్యాణ్ కీస్ బృందం రూపొందించిన పాట.. తెలంగాణే కాదు.. విదేశాల్లోనూ మార్మోగుతోంది.
బీఆర్‌ఎస్ ఆవిష్కరించిన రామక్క పాటకొచ్చిన ప్రజాధరణతో.. కాంగ్రెస్ పేరడి పాటను రూపొందించింది. బీఆర్‌ఎస్ సర్కారు పాలనా వైఫల్యాల్ని విమర్శిస్తూ.. అచ్చం అదే తరహాలో పాటగట్టింది. బీజేపీ సైతం అచ్చం ఇదే తరహాలో పాటను రూపొందించింది. పాటలో బీఆర్‌ఎస్ ప్రస్తావించిన అంశాలకు వ్యతిరేకంగా వైఫల్యాల్ని ఎండగడుతూ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లింది.
Telangana Assembly Election 2023 : ప్రగతి మంత్రంతో బీఆర్‌ఎస్, కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై కాంగ్రెస్, బీజేపీలు రూపొందించిన రామక్క పాటలు ఎన్నికల వేళ విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇటీవలి బతుకమ్మ వేడుకల్లోనూ ఈ పాటలు వాడవాడల మార్మోగాయి. నియోజకవర్గాలోని వివిధ పార్టీల అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా అదే పాటను మలుచుకుంటున్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ పాటలను వైరల్ చేస్తున్నారు. వీటిని వింటున్న వారు మాత్రం.. అరె!! అన్నీ ఒక్కతీర్గనే ఉన్నయె!! అంటూ ఆశ్చర్యపోతున్నారు.
పోలింగ్ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?