Telangana Election Campaign 2023 : శాసనసభ ఎన్నికల రణక్షేత్రం తుది అంకానికి చేరుకొంది. 30న జరగనున్న పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల కదనరంగంలో పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించాయి. ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేశాయి. మేనిఫెస్టోలు, గ్యారంటీలు, భరోసా అంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ప్రచారపర్వం తారస్థాయికి చేరింది. అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులతో పాటు ముఖ్యనేతలు, అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. నేతలు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడిక్కించారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాన్ని రంజుగా మార్చారు. ఎత్తులు, పైఎత్తులతో రాజకీయ పార్టీలు పోరును రక్తికట్టించాయి.
BRS Election Campaign 2023 : ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార భారత రాష్ట్ర సమితి తీవ్రంగా యత్నిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో ఘనవిజయంతో రాష్ట్ర పాలనాపగ్గాలు దక్కించుకొన్న కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళం.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 'ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది తెలంగాణ' అంటూ కేసీఆర్(KCR) నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలు, రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారపర్వంలోనూ ముందున్న బీఆర్ఎస్.. కొన్ని కొత్త హామీలతో మేనిఫెస్టో(Manifesto) ప్రకటించింది.
తుది ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం - పార్టీ గుర్తును చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు
BRS Leaders Campaign : పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీశ్ రావు, మంత్రులు, అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్(Congress) వైఖరిని ఎండగడుతూ విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనం మొదలు.. ఇందిరమ్మరాజ్యం సహా ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానం వరకు కాంగ్రెస్ తెలంగాణకు తీవ్రనష్టం చేసిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
Congress Election Campaign 2023 : ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రెండు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రమిస్తోంది. ఇటీవలి కర్నాటక ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ప్రకటించి.. గతానికి భిన్నంగా దూకుడుగానే వెళ్తోందని చెప్పవచ్చు. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ స్థానాన్ని కేటాయించిన హస్తం పార్టీ.. కోదండరాం నేతృత్వంలోని జనసమితి మద్దతు పొందింది. షర్మిల నేతృత్వంలోని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ(YTP) సంఘీభావం ప్రకటించింది.
రసవత్తరంగా కోదాడ రాజకీయాలు - బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి
Congress Leaders Election Campaign : కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు ప్రధానంగా ఎత్తి చూపుతూ.. పదేళ్ల హయాంలో అమలు చేయని హామీలు ప్రస్తావిస్తూ వెళ్తోంది. 'మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి' అంటూ ప్రజల్లోకి వెళ్లింది. అభ్యర్థిత్వాల విషయంలో సుధీర్ఘ కసరత్తు చేసిన పార్టీ.. సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. బీఆర్ఎస్ లో అవకాశం రాని సీనియర్ నేతలు, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకొని వారికి ఎన్నికల్లో అవకాశమిచ్చింది. ఆర్థికంగా, ఇతర రకాలుగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చి బరిలో దింపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీలో నిలిపింది. పార్టీలో అసంతృప్తులకు భవిష్యత్‌లో అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
BJP Election Campaign 2023 : డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలపై కమలం అధినాయకత్వం దృష్టి సారించింది. రెండుచోట్లా బీజేపీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. సర్కార్ వైఫల్యాలు ఎండగడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కార్యక్రమాలు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు వెళ్తోంది. జనసేనతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీసీ సీఎం నినాదంతో కమలం పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది. బీసీల రాజ్యాధికారం, ఆత్మగౌరవం.. ఎస్సీ వర్గీకరణను ప్రధాన ఎజెండాగా బీజేపీ తీసుకొంది. మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా పేరిట మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు.
ఊరూరా హోరెత్తిన ప్రచారం - ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా
MIM Election Campaign 2023 : పాతబస్తీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీ.. మరోమారు అదే వ్యూహంతో ముందుకెళ్తోంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించిన మజ్లిస్ పార్టీ.. కొత్తవారికి అవకాశం కల్పించింది. ఏడు స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లోనూ పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ఎన్నికల సభలతో హోరెత్తించారు. పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఒవైసీ పిలుపునిచ్చారు.
CPM Election Campaign 2023 : సీపీఎం ఒంటరిగానే 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 107 స్థానాల్లో పోటీచేస్తోంది. ప్రవీణ్ కుమార్ స్వయంగా సిర్పూర్‌లో, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్ అలంపూర్‌లో పోటీ చేస్తున్నారు. పలువురు విద్యావంతులు, యువతకు బీఎస్పీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.
పోటాపోటీగా విపక్షాల ప్రచారాలు - రంగంలోకి దిగిన జాతీయ నాయకులు