Maha Shakthi Scheme in Manifesto: భవిష్యత్‌కు భరోసా పేరుతో ఎన్నికల కురుక్షేత్రానికి ఆయుధాలు ఇస్తున్నానంటూ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తొలి మేనిఫెస్టో ప్రకటించారు. మహిళలు, యువత, బీసీ, రైతు, పేదలకు ప్రాధాన్యం ఇస్తూ.. అయా వర్గాలకు చేకూరే లబ్ధిని వివరించారు. దసరా నాటికీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తానన్న చంద్రబాబు.. ఈ లోపు తొలి మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
మహిళా సాధికారతకు మహాశక్తి పేరిట నాలుగు పథకాల్ని ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా 1500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 18 వేల రూపాయల చొప్పున, ఐదు సంవత్సరాలలో 90వేల రూపాయలు ఆడ బిడ్డల ఖాతాలకు పంపిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
"మహిళల శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33శాతం రిజర్వేషన్లు పెట్టి , ఆర్టీసీ బస్సులో డ్రైవర్లు, కండక్టర్లుగా మా ఆడబిడ్డలు రాణిస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం. నా ఆడబిడ్డల అవసరాన్ని గుర్తించి మహాశక్తి అనే పథకాన్ని తీసుకువస్తున్నా. ప్రతి మహిళను ఓ మహాశక్తిగా చేయాలనేది నా సంకల్పం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున డైరెక్టుగా మీ అకౌంట్లో వేస్తాం. ఇంట్లో ఎంత మంది ఉంటే వారందరికి కూడా ఇస్తాం"-చంద్రబాబు, టీడీపీ అధినేత
తల్లికి వందనం కార్యక్రమం కింద.. చదువుకుంటున్న పిల్లల తల్లులకు ప్రతి సంవత్సరం 15వేల రూపాయలు ఇస్తామని.. చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15వేల రూపాయల చొప్పున ఈ పథకం కింద అందజేస్తారని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని.. చంద్రబాబు హామీ ఇచ్చారు.
"అమ్మఒడి ఒక బూటకం. అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేశాడా లేదా. అందుకే నేను ఆలోచించి తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొచ్చాం. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి బిడ్డకి 15వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇందులో ఎటువంటి నిబంధన లేదు"-చంద్రబాబు, టీడీపీ అధినేత
ప్రతి ఇంటికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి మేనిఫెస్టోలో ప్రకటించారు. మహిళలకు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
"ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. సిలిండర్ ధరలు 1200 దాటిపోయింది. చాలా మంది వాటిని కొనడం మాని.. కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను. అందుకే ఆలోచించా.. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. అలాగే మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్న.. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు"-చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: