Supreme Court On Menstrual Leave : విద్యార్ధినులు, మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చేలా రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. ఈ పిల్‌ను పరిశీలించిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయ విద్యార్థి వాదనను పరిగణనలోకి తీసుకుంది. నెలసరి సెలవులు మంజూరు చేయాలని యజమానులను బలవంతం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారు వెనుకాడవచ్చనే వాదనతో ఏకీభవించింది.
"మేము దీనిని(సెలవు ఇవ్వాలన్న ప్రతిపాదనను) తిరస్కరించడం లేదు. కానీ ఈ కారణం చూపెట్టి అనేక మంది యజమానులు మహిళకు ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యకు భిన్నమైన కోణాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే తర్వాత పరిశీలిస్తాము."
-- జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాన న్యాయమూర్తి
సెక్షన్ 14 మెటర్నిటీ బెన్ఫిట్ యాక్ట్ 1961 ప్రకారం నెలసరి సెలవులు ఇవ్వాలంటూ.. దిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మహిళలకు కష్టతరమైన ప్రసూతి సమయంలో జాగ్రత్తగా ఉండేందుకు అనేక నిబంధనలు ఉన్నప్పటికీ.. దాని మొదటి దశ రుతుస్రావాన్ని విస్మరించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికీ అనేక ప్రభుత్వ కార్యాలయాలు సహా అనేక సంస్థల్లో నెలసరిలో ఉన్న మహిళలకు ప్రత్యేక ఏర్పాటు లేవని చెప్పారు. బ్రిటన్, చైనా, వేల్స్, జపాన్, తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జాంబియా దేశాలు ఇప్పటికే మహిళలకు నెలసరి సెలవులను ఇస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బిహార్ మాత్రమే మహిళలకు నెలసరి సెలవులను ఇస్తోందని వివరించారు.
ఇవీ చదవండి : 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు.. మీటింగ్‌కు సోనియా, రాహుల్ దూరం
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి.. స్నేహితుడిని దించేందుకు వెళ్తూ మరో ఐదుగురు..