అన్నాడీఎంకేలో పట్టుకోసం పోరాటం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత పన్నీరుసెల్వంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం పళనిస్వామి కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రుషికేష్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. పన్నీరుసెల్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులతో.. పళనిస్వామి మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఆయన చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
'ద్రోహుల కళ్లు తెరచుకున్నాయి'
AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ దిగ్గజాలు, దివంగత ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశీస్సులతో తమకు అనుకూలమైన తీర్పు వచ్చిందని చెప్పారు. సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థి పన్నీరుసెల్వంపై విమర్శలు గుప్పించిన పళనిస్వామి.. "DMKలో B-టీమ్‌గా పనిచేసి, అన్నాడీఎంకేను అంతం చేయాలని కోరుకున్న కొంతమంది ద్రోహులకు ఈ రోజు కళ్లు తెరచుకున్నాయి. AIADMKకు భవిష్యత్తు లేదని అన్నవారందరికి సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులతో మంచి ఎదురుదెబ్బ తగిలింది" అని ఆయన అన్నారు.
2022 జూలై 11న జరిగిన ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో పళనిస్వామి ప్రత్యర్థి పన్నీరుసెల్వం, ఆయన సహాయకులను కొందరిని బహిష్కరిస్తూ సింగిల్ లీడర్‌గా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో పళనిస్వామి ఎన్నికపై వ్యతిరేకంగా పన్నీరుసెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పళనిస్వామి ఎన్నిక సరైనదేనని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. మద్రాసు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పన్నీరుసెల్వం పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. పళనిస్వామి AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు అనుమతినిచ్చింది.