ఉద్యోగ అర్హతకు సంబంధించి తమ ఫిట్‌నెస్/యోగ్యతపై తప్పుడు వివరాలు సమర్పించేవారిని, వాస్తవాలను దాచిపెట్టేవారిని సర్వీసు నుంచి తొలగించొచ్చని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను దాచడమన్నది వారి ప్రవర్తన తీరును సూచిస్తుందని పేర్కొంది. ప్రధానంగా పోలీసు బలగాల నియామక ప్రక్రియల్లో ఆ వివరాలను నిశితంగా పరిశీలించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. తనపై ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి అభ్యర్థి సరైన సమాచారాన్ని అందించినంతమాత్రాన.. తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
గతంలో ఉన్న కేసుల ఆధారంగా ఆ వ్యక్తి ప్రవర్తన శైలిని అంచనా వేసి.. ఉద్యోగానికి యోగ్యుడో కాదో యాజమాన్యం నిర్ధారించుకోవచ్చని తెలిపింది. తమపై ఉన్న కేసుల వివరాలను దాచిపెట్టిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తరహా కేసుల్లో ఎలాంటి సూత్రాలను వర్తింపజేయాలన్నదానిపై కూడా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం కీలక మార్గదర్శకాలను వెలువరించింది.
'బెయిల్'పై విచారణ ఆపేయడం జీవించే హక్కును భంగపరచడమే
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టే విషయంలో బొంబాయి హైకోర్టు జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్ (73) హోంమంత్రిగా ఉన్నప్పుడు ముంబయి నగరంలో సచిన్ వాజే అనే పోలీసు అధికారి ద్వారా వివిధ బార్ల నుంచి రూ.4.70 కోట్లు వసూలు చేశారనే అభియోగంతో ఈడీ కేసు పెట్టింది. కేసులో 2021 నవంబరులో అరెస్టైన అనిల్ నాటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, బెయిల్‌పై విచారణ వేగంగా పూర్తి చేయాలని హైకోర్టును కోరారు. అయితే... 2022 ఏప్రిల్ 8న ఆయన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణను తీవ్ర జాప్యం చేయడం ఆర్టికల్ 21 ఇచ్చిన జీవించే హక్కును భంగపరచడమేననే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. బెయిల్‌పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.
సరోగసీ చట్టంపై కేంద్రం అభిప్రాయం కోరిన సుప్రీం : సరోగసీ (నియంత్రణ) చట్టం-2021, సహాయక పునరుత్పత్తి సాంకేతిక (నియంత్రణ) చట్టం-2021 నిబంధనలు... గోప్యత, మహిళల పునరుత్పత్తి హక్కులకు విరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.
చెన్నైకు చెందిన అరుణ్ ముత్తువేల్ దీన్ని దాఖలు చేశారు. "సరోగసీ చట్టం.. వాణిజ్యపరమైన సరోగసీని పూర్తిగా నిషేధించింది. మహిళల పునరుత్పత్తి హక్కులను పరిమితం చేసేలా, ఏకపక్షంగా ఉంది. సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టంలో మెడికల్ ప్రాక్టీషనర్లకు భారీ జరిమానాలు విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కొట్టివేయాలి" అని పిటిషనర్ అభ్యర్థించారు.
ఎన్నికల గుర్తు కేటాయింపుపై పిటిషన్ తిరస్కరణ : ఎన్నికల గుర్తు కేటాయింపునకు సంబంధించిన ఓ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియకు ఇది అవాంతరం కలిగించేలా ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయపరమైన సమయాన్ని వృథా చేసినందుకుగాను పిటిషనర్‌కు రూ.25 వేల జరిమానా విధించింది.
ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, రిటర్నింగ్ అధికారి మాత్రమే వాటిని కేటాయించాలంటూ ఓ న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు గతంలో కొట్టేసింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓక్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. "ఈ వ్యాజ్యం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఉంది. కేవలం వ్యాజ్యం వేయాలన్న ఉద్దేశంతోనే వ్యాజ్యాలను సృష్టిస్తూ ఉంటామా? ఇది అలవాటుగా మారకూడదు" అని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: ఉద్యోగం కోసం పట్టు వదలకుండా వేట.. వరుసగా 600 మెయిల్స్.. చివరకు జాక్‌పాట్!
అమ్మకు గోల్డ్.. కూతురికి బ్రాంజ్.. పనిమనిషి కుటుంబానికి పతకాల పంట