Supreme Court on Ushodaya Writ Petition: గ్రామ - వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు 'సాక్షి' పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పిస్తూ, ఆ పథకాలను అందుకోవడంలో ప్రజలకు సహకారం అందించడానికి.. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.56 లక్షల మంది వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలో నియమించింది. వారికి నెలవారీ 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న పత్రిక కొనుగోలుకు నెలకు 200 రూపాయల చొప్పున వాలంటీర్లకు చెల్లించాలని.. 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 1.45 లక్షల మంది వాలంటీర్లకు 200 రూపాయల చొప్పున మంజూరు చేస్తూ 2022 డిసెంబర్‌లో మరో జీవో ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ.. ఈనాడు ప్రచురణకర్త అయిన ఉషోదయ పబ్లికేషన్స్ గత ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ జీవోల్లో 'సాక్షి' అనే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. అందులో పెట్టిన షరతులు గానీ, ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ కార్యకర్తలు 'ఈనాడు'ను ఎల్లో మీడియాగా విమర్శిస్తూ... ఆ పత్రికను చదవొద్దని చేస్తున్న ప్రచారం గానీ.. వాలంటీర్లు కచ్చితంగా 'సాక్షి'నే కొనమని సూచించేలా ఉన్నాయి.
ఈ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. 2020లో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి దీన్ని వింటామని చెప్పింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 'ఈనాడు' సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రతివాదులకు మార్చి 29న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, రంజిత్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వాలంటీర్లు ఎవరు, వారి నియామకం ఎలా జరుగుతుందని.. ప్రతివాది అయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని, రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నారని.. 'ఈనాడు' తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, దేవదత్ కామత్, న్యాయవాది మయాంక్ జైన్ చెప్పారు. ఈ కేసును హైకోర్టులో చేపట్టిన తీరు చాలా ఆందోళనకరంగా ఉందన్న ధర్మాసనం.. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు బదిలీ చేస్తామని, దానిపై వారే విచారణ చేపడతారని పేర్కొంది. ఈ కేసును దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడానికి ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు ఏప్రిల్ 21న ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న తరుణంలో.. ఇప్పుడు దిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే అనవసరంగా జాప్యం జరుగుతుందన్నారు. ఉషోదయ సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను పాత పిల్‌తో కలిసి విచారణ చేయడానికి వీల్లేదని, అందువల్ల దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడమే సమంజసమని ముకుల్ రోహత్గీ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు తెలుసుకోవడానికి శుక్రవారం వరకు విచారణ వాయిదా వేయాలని ఈ సందర్భంగా సీఎస్ వైద్యనాథన్ కోరారు. అవసరమైతే జీఓలు, ఆ తర్వాతి పరిణామాలపై స్టే ఇస్తామని పేర్కొంటూ.. తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి :