దేశవ్యాప్తంగా దుమారం రేపిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కేంద్రం, సెబీ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాక్ మార్కెట్‌లో భారత మదుపర్ల పెట్టుబడులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఫిబ్రవరి 13 నాటికి సెబీ ప్రతిస్పందనను కోరింది. ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో మదుపర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నాయమూర్తులు జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ జేబి పార్ధివాలాతో కూడిన సీజేఐ ధర్మాసనం.. నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని నిర్దేశించింది. సెబీ తరపున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్.. మార్కెట్ రెగ్యులేటర్, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని నివేదించారు.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ ఓ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది ఎంఎల్ శర్మ ఇదే తరహాలో మరో పిల్ వేశారు. అదానీ షేర్లు కృత్రిమంగా పతనమయ్యేందుకు హిండెన్‌బర్గ్ కుట్ర పన్నిందని, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ రెండు పిల్లపై సెబీ, కేంద్రానికి కొన్ని ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గించిన మూడీస్..
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై తన నివేదిక విడుదల చేసిన తర్వాత.. ఆ సంస్థ మార్కెట్ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ శుక్రవారం అదానీకి చెందిన నాలుగు కంపెనీల రేటింగ్ అవుట్‌లుక్‌లను తగ్గించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ కంపెనీల రేటింగ్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది.