న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసే సిఫార్సులపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పడానికి నిర్దిష్ట సమయం ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ పేర్కొన్నారు. 11 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు గత ఏడాదిన్నరగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటాన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆదివారం రాత్రి ఆయన ఇక్కడ తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొలీజియం సిఫార్సుల అమలుకు ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా ఆ ఆలోపే చెప్పాలి. దీనిపై ఇరువర్గాలు కలిసి కూర్చొని చర్చించుకొని 4, 6, 8 వారాల్లో ఏదో ఒక గడువు ఖరారు చేసుకోవాలి. ఇప్పటి వరకూ అలాంటిది లేదు కాబటి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసం దీనిపై నోటీసులు జారీ చేసినట్లు కనిపిస్తోంది.
- ప్రతి ఒక్కరూ కొలీజియం చేపట్టే ప్రక్రియను అర్థం చేసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకు హైకోర్టు కొలీజియం 1+2 విధానంలో పేర్లు పంపుతుంది. వాటిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు స్వీకరిస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఆ వ్యక్తుల గుణగణాలు తెలుసుకుంటుంది. తర్వాత ఆ పేర్లు సుప్రీంకోర్టు కొలీజియం ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే న్యాయమూర్తులను సంప్రదించి ఆ వ్యక్తుల గురించి అభిప్రాయాలు తీసుకుంటాం. ఆ తర్వాతే కొలీజియం సిఫార్సులు చేస్తుంది.
- కొలీజియం హైకోర్టు నుంచి వచ్చిన పేర్లను సిఫార్సు చేస్తుంది తప్పితే అందులో లేని పేర్లను జతచేయదు. అందువల్ల అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. భాగస్వాములందర్నీ సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం.
- నావరకు కొలీజియం వ్యవస్థ ఉత్తమమైందే. 750 న్యాయమూర్తులున్న హైకోర్టులకు జస్టిస్ రమణ నేతృంలోని కొలీజియం 250మందికిపైగా పేర్లును సిఫార్సు చేసి నియామకాలు జరిగేలా చూడటాన్ని బట్టి కొలీజియం మంచిదే అని నిరూపితమైంది. ఎన్‌జేఏసీ జడ్జిమెంట్‌లో న్యాయమూర్తుల నియామకం గురించి స్పష్టంగా చెప్పారు. అదే ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్. అందువల్ల కొలీజియం ఉండాలి. అందులో సాధ్యమైనంత వరకు మెరుగులు దిద్దాలి.
- ఇటీవల ఓ అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష రద్దు చేయడానికి కారణాలున్నాయి. ఈ కేసులో దోషులకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాలు లభించడంలేదు. అలాంటప్పుడు మరణశిక్ష విధించడం మంచిదికాదు.
- జీఎన్ సాయిబాబా కేసు విచారణకు సెలవు రోజైన శనివారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విమర్శల్లో వాస్తవంలేదు. ముందుగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ బెంచ్‌ను ఖరారు చేయలేదు. ఆ కేసు తొలుత శుక్రవారం కోర్టుముందుకొచ్చింది. అది జస్టిస్ హేమంత్ గుప్తాకు చివరి రోజు. పదవీ విరమణ చేసే న్యాయమూర్తి సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో కూర్చుంటారు కాబట్టి ఆ రోజు సీజేఐ ధర్మాసనం ముందుగానే పని ముగించింది. దానివల్ల ఆరోజు సాయిబాబా కేసు ప్రస్తావన(మెన్షనింగ్) జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు జరిగింది.
రిజస్ట్రీ అధికారులు సాయంత్రం 4 గంటల సమయంలో నావద్దకు వచ్చి మ్యాటర్‌ను శనివారం కేసుల విచారణ జాబితాలో చేర్చాలని ధర్మాసనం ఆదేశించినట్లు చెప్పారు. ఒకవేళ ఆ కేసులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి వస్తే జస్టిస్ హేమంత్ గుప్తా కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యే న్యాయమూర్తులను సంప్రదిస్తానని రిజిస్ట్రీ సిబ్బందికి చెప్పాను. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ శనివారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆ బెంచ్‌లో భాగస్వామ్యానికి మాత్రం వీలుకాదని చెప్పారు. ఆఖరుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ఎంఆర్ షాలు సుముఖత వ్యక్తం చేశారు. నేను వారికి ప్రత్యేక ధర్మాసనం గురించి చెప్పాను తప్పితే మరి ఏ వివరాలూ చెప్పలేదు. మరుసటి రోజు బెంచ్ ముందు జరిగిన విచారణతో నాకేమాత్రం సంబంధంలేదు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రసారం జరుగుతున్నట్లుగా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని యు.యు.లలిత్ స్పష్టం చేశారు. అలాగే తాను వేదాలు, భగవద్గీత, బెంగాలీ నేర్చుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: