ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. సూరత్ విద్యార్థులు బంగారు పూత పూసిన గులాబీ పూలను బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీకి ఈ బహుమతిని అందించనున్నారు. మోదీపై తమకున్న ప్రేమను తెలిపేందుకు ఈ పూలను ఇస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. 24 కారెట్ల బంగారంతో పూత పూసిన 151 గులాబీను మోదీకి ఇవ్వనున్నారు విద్యార్థులు.
కాగా, మోదీ... విద్యార్థులతో ముచ్చటించడానికి, వారితో సమయం గడిపేందుకు.. వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తుంటారు. ప్రతి సంవత్సరం విద్యార్థులతో పరీక్షా పే చర్చ జరుపుతారు. చాలా సందర్భాల్లో వారితో సమావేశం అవుతారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుగా అభివర్ణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోదీపై అభిమానం పెంచుకున్న విద్యార్థులు.. ఈ ప్రత్యేక బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించారు.
భర్తకు భార్య ప్రత్యేక బహుమతి..
మరోవైపు, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భర్తకు ప్రత్యేక బహుమతి అందించింది ఓ మహిళ. 108 బంగారు గులాబీలతో హార్ట్ షేప్‌లో రూపొందించిన ప్రత్యేక బొకేను భర్తకు ఇచ్చింది. పెళ్లి తరువాత వచ్చిన మొదటి ప్రేమికుల దినోత్సవం కారణంగా ఈ ప్రత్యేక బహుమతి ఇచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దీని ధర దాదాపు 1లక్ష 80వేల రూపాయలు ఉంటుందని తయారీదారులు తెలిపారు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పరిధిబెన్ అనే మహిళ.. తన భర్త దీప్‌కు ఈ బహుమతి ఇచ్చింది. "నిజమైన గులాబీలైతే వాడిపోతాయి. ఈ బంగారు పూత పూసిన గులాబీ అస్సలు వాడిపోవు. ఎల్లకాలం మా ప్రేమకు గుర్తుగా ఉంటాయి. నా భార్య ఇచ్చిన బహుమతితో చాలా సంతోషంగా ఉన్నాను" అని దీపు చెప్పాడు. ఈ ప్రేమికుల రోజున నా భర్తకు ఏదైన కొత్తగా ఇవ్వాలనుకున్నాని, అందుకే ఈ గులాబీ పూలు ఇచ్చానని పరిధిబెన్ తెలిపింది.