Special Arrangements for Tirumala Garuda Vahana Seva: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష, చిన్న శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం మోహిని అవతారాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించనున్నారు. రాత్రికి అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు.
తిరుమలకు చేరుకున్న గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు, బొమ్మ చిలుకలు: ఆనవాయితీగా గరుడవాహన సేవకు అలంకరించేందుకు తమిళనాడు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు, బొమ్మ చిలుకలు తిరుమలకు చేరుకున్నాయి. గరుడసేవ వాహనసేవకు అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ ఆధ్వార్యంలో చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్న తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
TTD Brahmotsavams 2023 : కల్పవృక్షంపై భక్తులకు దర్శమిస్తున్న మలయప్ప స్వామి
కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం: శ్రీవారి ఆలయ మాడ వీధుల గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం ఉండటంతో ఈ సారి వాహన సేవను వీక్షించేందుకు కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తుల కోసం సుపథం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసింది.
గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా నెమ్మదిగా ముందుకు కదిలేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించనున్నారు. మాఢవీధుల్లోని గ్యాలరీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.
Tirumala Srivari Brahmotsavam : తిరు వీధుల్లో సింహ వాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి
కీలక ఘట్టానికి భారీ బందోబస్తు: బ్రహ్మోత్సవాలలో కీలకఘట్టమైన గరుడ సేవకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని అనంతపూర్ రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే గరుడసేవను గ్యాలరీల నుంచి రెండు లక్షల మంది భక్తులు దర్శించుకొనేందుకు వీలుందన్నారు. గరుడసేవకు ఐదు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని.. సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పిస్తామన్నారు.
రహదారుల్లో ద్విచక్రవాహనాలకు నిషేధం: తిరుమలలో వాహనాల పార్కింగ్‌కు పరిమిత సంఖ్యలో అవకాశం ఉండటంతో అదనంగా వచ్చే వాహనాలను తిరుపతిలోనే నిలిపివేయనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
"గరుడ వాహన సేవకు తిరుపతి పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధం అవడం జరిగింది. తితిదేతో కలిసి చర్చించి తగు చర్యలు తీసుకున్నాం. ఎక్కువ మందికి సరిపోయేలా లైన్లను ఏర్పాటు చేశాము. సుమారు 5 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము". - అమ్మిరెడ్డి, అనంతపూర్ రేంజ్ డీఐజీ