Sonia Gandhi ED summon: మనీలాండరింగ్ కేసులో విచారణను కొద్దిరోజులు వాయిదా వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నేపథ్యంలో.. పూర్తి ఆరోగ్యంగా మారేంతవరకు తనను విచారణకు హాజరుకావడాన్ని మినహాయించాలని కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ 23న విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ ఇదివరకే సమన్లు పంపింది. అయితే, ఈడీ ముందుకు సోనియాగాంధీ వెళ్లే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి.
"కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో సోనియాగాంధీ బాధపడుతున్నారు. సుమారు తొమ్మిది రోజుల పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యల నేపథ్యంలో సోనియా విశ్రాంతి తీసుకోవాలని డిశ్చార్జి సమయంలో వైద్యులు సూచించారు. అందుకే కొద్దివారాల పాటు విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని ఈడీకి సోనియా లేఖ రాశారు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
వైద్యుల సూచన మేరకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సోనియాగాంధీ విముఖత చూపుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కాలేనని.. మరికొంత సమయం ఇవ్వాలని సోనియా కోరినట్లు సమాచారం. తప్పని పరిస్థితి అయితే తన ఇంటికి వచ్చి ప్రశ్నించాలని సోనియాగాంధీ కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇదే కేసులో సోనియా తనయుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు ప్రశ్నించింది. ఐదోరోజైన మంగళవారం 11 గంటలు విచారించింది.
ఇదీ చదవండి: