Cooking Oil Study: బయటకు వచ్చినప్పుడు నూనెలో వేయించిన చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాల్ని లాగించేస్తున్నారా? అయితే.. జాగ్రత్తపడాల్సిన విషయమే. ఎందుకంటే.. వాటి తయారీ కోసం చాలావరకు అప్పటికే వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తంగా చూస్తే.. వినియోగించిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు తేలింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్).. కోన్ అడ్వైజరీ గ్రూప్, ఫిన్‌లాండ్‌కు చెందిన నెస్టేతో కలిసి కోల్‌కతా, ముంబయి, దిల్లీ, చెన్నై నగరాల్లో ఈ మేరకు ఓ అధ్యయనం చేపట్టింది.
ఇందులో భాగంగా 500కు పైగా చిన్నాపెద్దా వాణిజ్య ఆహార వ్యాపార నిర్వాహకులను సర్వే చేసింది. ఈ క్రమంలోనే వాడిన నూనెను తిరిగి ఉపయోగించడం అనేది చాలా విస్తృతంగా సాగుతోందని గుర్తించింది. ముఖ్యంగా చాలావరకు చిన్న సంస్థలు, వీధి వ్యాపారులు ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి.. ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వంట కోసం వాడితే.. క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. పైగా భారత్‌లో ఆహార భద్రత మార్గదర్శకాల ప్రకారం.. ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ ఏ రూపంలోనైనా వాడటంపై నిషేధం ఉంది.
ఈ క్రమంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వారిలో మార్పు తెచ్చేందుకు, అవగాహనను పెంచేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని అధ్యయనం సూచించింది. ఈ దిశగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్యులు, పోషకాహార నిపుణులు, ప్రైవేట్ రంగ సంస్థలు పరస్పర సహకారంతో పని చేయాలని సూచించింది. వాడిన నూనె నిర్వహణ విషయంలో మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయడం ఆరోగ్యం దృష్ట్యా ఎంతో కీలకమని సహ అధ్యయనకర్త ఊమెన్ కురియన్ అన్నారు. ఉపయోగించిన వంట నూనెను తిరిగి ఉపయోగించకుండా దాన్ని బయో డీజిల్ వంటి పునరుత్పాదక వనరుల వైపు మళ్లించడం ద్వారా.. ప్రజారోగ్య ముప్పును తగ్గించడంతోపాటు వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చన్నారు.
ఇవీ చదవండి: తల్లి ఒడిలో నుంచి 7 నెలల చిన్నారి అపహరణ, సీసీటీవీ దృశ్యాలు వైరల్