హరియాణా అంబాలాలోని బలానా గ్రామంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విగతజీవులుగా మారారు. ఇంట్లోని వారందరూ ఉరి వేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. వీరిలో ఒకరు పుట్టినరోజు నాడే మరణించడం అందరినీ కలచివేసింది. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ పోలీసులకు దొరకగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గురువారం రాత్రి వరకు వీరంతా బాగానే ఉన్నారని, వీరి మృతి ఊహించనిదని స్థానికులు అంటున్నారు. మృతులను సంగత్ రామ్, అతని భార్య మహీంద్రా కౌర్, కుమారుడు సుఖ్వీందర్ సింగ్, కోడలు రీనా, మనవరాళ్లు అషు, జెస్సీగా గుర్తించారు. మరణాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరికిన రెండు పేజీల సూసైడ్ నోట్లో మృతికి కారణమైన వ్యక్తుల పేర్లు తెలిపారన్నారు. సూసైడ్ నోట్ ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులు సుఖ్వీందర్‌ను పది లక్షల రూపాయలు ఇవ్వమని బలవంతం చేశారు. అందుకు అతను నిరాకరించగా మృతుని కుటుంబానికి హాని కలిగిస్తామని బెదిరించారు. తమ మరణానికి కారణమైన వ్యక్తులకు శిక్ష పడేలా చేసి, తమకు న్యాయం జరిగేలా చూడాలని లేఖలో రాసుంది.
ఆగస్టు 17న ఇదే తరహా ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. జమ్ములోని సిద్రా ప్రాంతంలోని ఒక నివాసంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరిక్షల నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్, పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్‌బై
సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం, చరిత్రలో తొలిసారి