Yashwant sinha president: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సవాల్ విసిరారు. మతాల పేరిట విభజణకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని హితవు పలికారు. ద్రౌపదీ ముర్ము.. ప్రభుత్వానికి రబ్బర్ స్టాంపుగా మారబోనని ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రభుత్వానికి రబ్బరు స్టాంపుగా మారకుండా.. రాజ్యాంగ సంరక్షకుడిగా ప్రజలకు సేవ చేస్తానని యశ్వంత్ సిన్హా ప్రతిజ్ఞ చేశారు. ప్రజల భావప్రకటనా, స్వేచ్ఛా స్వాతంత్ర్య హక్కులను కాపాడుతానని తెలిపారు. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విషపూరిత మత విద్వేషాలను రెచ్చగొడుతోందని.. మతాల పేరిట ప్రజలను విభజిస్తోందని విమర్శించారు. తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే భారతీయ వైవిధ్యాన్ని కాపాడుతానని చెప్పారు.
"భారతీయుల భవిష్యత్తు కోసం రాష్ట్రపతి నిజాయితీగా పనిచేయాలి. నేను రాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగ సంరక్షుడిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రభుత్వానికి రబ్బరు స్టాంపును కాను. భాజపా అభ్యర్థి కూడా ఈ ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను."
-యశ్వంత్ సిన్హా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి
విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు భాజపా జాతీయ కార్యదర్శి సీటీ రవి. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పదవికి తగినది కాదనే భావన ఉండటం.. ఆయన దుష్ట మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దేశానికి రబ్బరు స్టాంప్ రాష్ట్రపతి అవసరం లేదని..అదే విధంగా మహిళపై తప్పుడు ప్రచారాలకు పాల్పడే వ్యక్తులు అవసరం లేదన్నారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా, ఒడిశా మంత్రి, ఎమ్మెల్యేగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపారు.
జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ను పార్లమెంట్‌లోని 63 నెంబరు గదిలో నిర్వహిస్తామని.. రాష్ట్ర అసెంబ్లీలలో నిర్దేశించిన రూముల్లో జరుపుతామని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ సాగుతుందని పేర్కొన్నారు.జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇదీ చదవండి: 'మహా' బలపరీక్షలో నెగ్గిన సీఎం శిందే.. మరోసారి సుప్రీంకు ఠాక్రే వర్గం