Singareni Officials Visited Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగార నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల వెలువరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన టెండర్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కేసీఆర్ సూచన మేరకు సింగరేణి అధికారులు సత్యనారాయణ, సుబ్బారావు, బలరాం తదితరులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించారు. స్టీల్ ప్లాంట్ డైరెక్టర్లు వేణుగోపాలరావు.. బాగ్చీ, మొహంతితో సమావేశమైన అధికారులు పలు అంశాలపై చర్చించారు.
Singareni Team at Vizag Steel plant : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకీ ఫండింగ్ ఎలా చేయాలి..? ఫ్యాక్టరీకి కుకింగ్ కోల్ ఎంత వాడుతారు..? ఐరన్ ఓర్ ఎంత ఉంది..? కన్వర్షన్ ఛార్జెస్ ఎంత అవుతాయి..? తదితర అంశాలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాన్‌పవర్ కాస్ట్ కోసం సుమారు 7 శాతం నిధులు అవసరమవుతాయని.. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే వడ్డీ 11 శాతం అవుతుందనే అంశాలు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది.
ఫ్యాక్టరీలో ముడిసరుకు కొరత: విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి నేరుగా ఇనుము కొనుగోలు చేయడం లాభదాయకమేనని సింగరేణి ఉన్నతాధికారుల బృందం ప్రాథమిక అంచనా వేసింది. విశాఖ నగరం నడిబొడ్డున 20 వేల ఎకరాలకు పైగా భూములున్న కర్మాగారాన్ని లాభదాయకంగా నడపటానికి ఉన్న అవకాశాలను అధికారులు వివరించినట్లు సమాచారం. కేవలం నాలుగైదు వేల కోట్లు సమకూరిస్తే ప్లాంట్ నిర్వహణకు ప్రస్తుతం ఇబ్బందులుండవని చెప్పినట్లు తెలుస్తోంది. కర్మాగారంలో 3 ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నా ముడిసరుకు కొరతతో రెండే నడుస్తున్నట్లు సింగరేణి అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు.
ప్లాంట్ల లోపల క్షుణ్ణంగా పరిశీలించనున్న సింగరేణి అధికారులు: 3 ప్లాంట్లలోనూ ఉత్పత్తి చేస్తే నిర్వహణ వ్యయం కొంత తగ్గి ఇనుము ధరను తగ్గించి విక్రయించవచ్చని అంచనా వేశారు. ఇవాళ ప్లాంట్ల లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించిన సింగరేణి అధికారులు.. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. ఉక్కు కర్మాగారం పెట్టుబడుల్లో ప్రభుత్వరంగ సంస్థలు భాగస్వామ్యమైతే నిర్వాసితులకు, కార్మికులకు న్యాయం జరుగుతుందని ఉక్కు పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఉక్కు పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులను.. ఉక్కు పోరాట కమిటీ, కార్మిక నాయకులు కలిశారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. సింగరేణి అధికారుల బృందం రెండురోజుల పాటు వైజాగ్‌లోనే ఉండనుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సేకరించాలనుకుంటున్న నిధులు, వాటి ద్వారా తిరిగి ఇచ్చే ఉత్పత్తులు, తిరిగి చెల్లించేవి విధానాలతో పాటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విధించే నిబంధనలు, షరతులను కూలంకషంగా అధ్యయనం చేయనుంది.
ఇవీ చదవండి: