Singareni Directors At Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తెలంగాణ సర్కార్ తమ ఫోకస్ పెంచింది. ఉక్కు పరిశ్రమ విషయంలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారు పర్యటిస్తున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు బిడ్‌పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. అనంతరం ఉక్కు పరిశ్రమ అధికారులతో చర్చించనున్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ లేకపోవడంతో.. మార్కెటింగ్ సీజేఎం సత్యానందంతో భేటీకానున్నట్లు సమాచారం.
సింగరేణి డైరెక్టర్లను ఆహ్వానించిన పోరాట కమిటీ: మరోవైపు సింగరేణి డైరెక్టర్లను ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానించింది. ఈవోఐలో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్లను ఆహ్వానిస్తున్నట్లు పోరాట కమిటీ తెలిపింది. ఈవోఐలో పాల్గొనకుండా ఎన్‌ఎండీసీ, సెయిల్, సింగరేణిని అడ్డుకుంటున్నారని కమిటీ ఆరోపించింది. డొల్ల కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వ సంస్థలు ఉంటేనే నిర్వాసితులు, కార్మికులకు న్యాయం జరుగుతుందని పోరాట కమిటీ స్పష్టం చేసింది.
ఇప్పటికే.. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన భారత్ రాష్ట్ర సమితి.. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. కార్మికులతో కలిసి ధర్నాలో సైతం పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న కార్మికులకు తన మద్దతు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కోనుగోలు చేసే క్రమంలో.. జయేశ్ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్‌కు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఆ గనులు.. అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టం: మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులను కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ఉక్కు పరిశ్రమ అవసరమని కేటీఆర్ తెలిపాపు. బైలదిల్లా గనులను అదానీ దోచుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. బైలదిల్లా గనులు విశాఖ, బయ్యారానికి సమీపంలో ఉన్నాయన్న కేటీఆర్.. ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ స్టీల్‌కు, తెలంగాణకు నష్టమని తెలిపారు. నష్టాలను జాతికి అంకితం చేసి.. లాభాలను దోస్తులకు అంకితం చేయటం మోదీ విధానమని కేటీఆర్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కావాలనే నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ అనేది అవాస్తవమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తోందన్న దానిపై తమకు ఆసక్తి లేదని.. కేంద్రం ఏం చేస్తుందన్నదే తమకు ముఖ్యమన్నారు.
ఇవీ చదవండి: