SIM card racket: సిమ్‌కార్డు ముఠా గుట్టును రట్టు చేసిన మరునాడే కీలక విషయాన్ని వెల్లడించారు ఒడిశా సైబర్‌సెల్ అధికారులు. ఈ ముఠా.. లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా పేరుతో ఓ సిమ్‌కార్డును రిజిస్టర్ చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డును బిర్లా పేరుతో తీసుకొని, ఆయన ఫొటోతోనే వాట్సాప్ ఖాతా క్రియేట్ చేసి ప్రజలను డబ్బులు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇదే నంబర్‌ను మూడు మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢేంకానాల్ జిల్లా తాల్బర్కోటె గ్రామంలో వీటిని గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సాయి ప్రకాశ్ దాస్, అవినాశ్ నాయక్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సిమ్‌కార్డులను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు.
Odisha Cyber Cell News: ఒడిశా సైబర్ సెల్ అధికారులు ఢేంకానాల్లో ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద 19, 641 సిమ్‌కార్డులు, 48 మొబైల్ ఫోన్లు, రూ.14.32లక్షల నగదును గుర్తించారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఈ ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు. ఢేంకానాల్ జిల్లా తాల్బర్కోటె గ్రామంలో ఒకే నంబర్‌ను మూడు ఫోన్లలో వినియోగిస్తున్నారని మొదటగా దిల్లీ పోలీసులు.. ఒడిశా క్రైం బ్రాంచ్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. వారు సైబర్ సెల్ బృందంతో రంగంలోకి దిగగా.. ముఠా గుట్టు రట్టయింది.
ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్.. భాజపా విమర్శలు!