ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఏడేళ్ల బాలుడిని అతికిరాతకంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. చిన్నారిపై యాసిడ్ పోసి, నాలుక కోసి, కళ్లు, పళ్లు పీకేసి అమానవీయంగా ప్రవర్తించారు. అనంతరం మృతదేహాన్ని బాలుడి చిన్నాన్న ఇంటి వెనుక మరుగుదొడ్డి కోసం తవ్విన గోతిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దండాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. అవధేశ్ సాహు కుమారుడైన సంతన్ కుమార్(7).. రెండు రోజుల క్రితం మిఠాయిలు కొనేందుకు స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత చాలా సమయం అయినా అతడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు.. చిన్నారి కోసం అనేక చోట్ల వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం ఉదయం.. స్థానికంగా ఉన్న చిన్నారులు పాఠశాలకు వెళ్తూ సంతన్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. అవధేశ్ సాహు తమ్ముడైన సురేశ్ సాహు ఇంటి వెనుక మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో సంతన్ నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి గ్రామస్థులకు తెలిపారు. వెంటనే గ్రామంలో ఉన్నవారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంతన్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవపరీక్షలు పూర్తయ్యాక బాలుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిపై దుండగులు.. యాసిడ్ పోసి, నాలుక కోసి, కళ్లు, పళ్లు పీకేసినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే చిన్నారిని ఇంత దారుణంగా చంపి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దళిత సోదరులు హత్య.. ఐదుగురు అరెస్ట్..
భూవివాదంలో ఇద్దరు దళిత సోదరులును హత్య చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే?
జిల్లాలోని చుడా తాలూకా సమాధియాలా గ్రామంలో తమ పూర్వీకుల భామిలో నాట్లు వేయడానికి పరుల్బెన్ పర్మార్‌తో పాటు మరికొందరు వ్యక్తులు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. వారిపై కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు. అందులో అమ్రాభాయ్ ఖచర్తో పాటు అతడి సోదరుడు, కుమారులు ఉన్నారని బాధితులు ఆరోపించారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సోదరులు అల్జీ పర్మార్ (60), మనోజ్ పర్మార్ (54) ఆస్పత్రిలో మరణించారు. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధిత వర్గం తరఫున డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లోని పెద్దలకు ఆయుధాల లైసెన్స్ ఇస్తామని, అలాగే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని గురువారం రాత్రి అరెస్టు చేశారు.
ఏడాదిన్నర చిన్నారిని నీళ్ల బకెట్లో ముంచి..
ఇటీవల.. ఏడాదిన్నర చిన్నారిని నీళ్ల బకెట్లో ముంచి హత్య చేసిన అమానుష ఘటన కేరళ ఎర్నాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఓ హోటల్ గదిలో బామ్మ ప్రియుడే.. చిన్నారిని చంపేశాడు.
ఇదీ జరిగింది
జిల్లాలోని కలూరు గ్రామానికి చెందిన వృద్ధ తల్లిదండ్రుల కుమార్తె విదేశాల్లో ఉంటుంది. ఆమె పిల్లలు.. ఈ వృద్ధ దంపతులతో కేరళలోనే ఉంటున్నారు. ఆ పిల్లలను గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగించుకుంటున్నారు బామ్మ, ఆమె ప్రియుడు జాన్ బినోయ్. ఈ విషయమై గతంలో బామ్మకు, జాన్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.