LEELA PAVITRA MURDER CASE UPDATES : నేను.. తాను ‘గాఢంగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక.. ఆమె మాట మార్చడంతో ఆవేదనకు గురయ్యా. ఆమె ఇక నాది కాదు.. వేరొకరికి దగ్గర అవుతుందనే విషయం నన్ను చాలా బాధించింది. నాకు దక్కనది ఇతరులకు దక్కకూడదనే కోపంతోనే అతికిరాతకంగా కత్తితో పొడిచినా అంటూ కాకినాడ యువతి లీలా పవిత్రను బెంగళూరులో హత్య చేసిన ప్రేమోన్మాది, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లివలస నివాసి దినకర్ పోలీసు విచారణలో వెల్లడించాడు.
లీలా పవిత్రను మంగళవారం రాత్రి బెంగుళూరులోని మురుగేశ్పాళ్య వద్ద కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసు అధికారుల ముందు నిందితుడు దినకర్ పలు విషయాలను వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘తాను ఎంతో ఇష్టంగా లీలాను ప్రేమించినట్లు..ఆమె లేని లోకం ఊహించలేక పోయి.. ఇలా మారుతానని కలలో కూడా అనుకోలేదు’ అంటూ ఆ యువకుడు మానసిక కుంగుబాటుకు లోనయ్యాడని జీవన బీమా నగర పోలీసస్టేషన్ వర్గాలు తెలిపాయి.
‘ఎలాగైనా మాట్లాడి పెళ్లికి ఒప్పించేందుకు వారం నుంచి వెంటపడినట్లు దినకర్ తెలుపుగా.. మాట్లాడేందుకు ఆమె నిరాకరించిందన్నాడు. ఆఖరి క్షణంలోనైనా మనస్సు మార్చుకుంటుందని పలుమార్లు ఫోన్ చేశానని.. ఆమె ఎంతకూ స్పందించలేదని.. ఇక లాభం లేదనే కారణంతో దొమ్మలూరులోని ఓ దుకాణంలో కత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రెండు సార్లు దాడి చేయాలని ప్రయత్నించినట్లు.. లీలా ముఖం చూస్తుంటే ఏమీ చేయలేక పోయానని.. అలా రెండుసార్లు వెనక్కి తగ్గి.. చివరికి మంగళవారం రాత్రి మనసు రాయి చేసుకుని కత్తితో కసి తీరా పొడిచి హత్య చేశా’ అంటూ చివరికి పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.
చదువుకునే సమయం నుంచి ఇద్దరం చనువుగానే ఉన్నాం..
దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. "విశాఖపట్నం కళాశాలలో ఎమ్మెస్సీ చదివే సమయం నుంచి ఇద్దరం ఎంతో చనువుగా ఉన్నాం. ఐదు సంవత్సరాల క్రితం బెంగుళూరు నగరానికి వచ్చి ఉద్యోగంలో చేరాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. కులాల కట్టుబాట్లు దాటి ఇద్దరం ఒక్కటై పెళ్లి చేసుకునేందుకు ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు సహజీవనం సాగించేందుకు నేను చేసిన ప్రతిపాదనలను ఆమె తిరస్కరించింది" అంటూ ఇటీవలి సంఘటనలన్నీ పోలీసులకు వివరించాడు.
ఈ ఘటనపై తీవ్రంగా విచారించిన పోలీసులు ఆ యువకుడిని గురువారం ఉదయం బెంగుళూరు మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. లీలా పవిత్ర మృతదేహానికి కుటుంబ సభ్యులు బెంగళూరులోనే దహన సంస్కరాలు నిర్వహించారు.
జీవనబీమా నగర పోలీసు అధికారులు ఘటన జరిగిన స్థలాన్ని ప్రదేశాన్ని పలుమార్లు పరిశీలించారు. ఆమె పని చేస్తున్న ఆఫీసు ఉద్యోగుల నుంచి కొన్ని విషయాలను సేకరించారు. నిందితుడు ఎప్పుడైనా కార్యాలయానికి వచ్చి లీలా పవిత్రతో కలిశాడా? ఆమెతో ఎక్కడైనా మాట్లాడినట్లు ఎవరైనా చూశారా? అనే వివరాలను సేకరించారు. దొమ్మలూరులో దినకర్ పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లి అతడి ప్రవర్తన, ఇతర వివరాలపై ఆరా తీశారు.
ఇవీ చదవండి: