Secret Witness in Viveka Murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగు రోజుల నుంచి వివేకా హత్య కేసులో జూన్ నెల 30 సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌కు సంబంధించిన విషయాలు సంచలనం సృష్టించగా.. తాజాగా వివేకా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఆ రహస్య సాక్షి వివరాలను సీబీఐ కోర్టుకు అధికారులు సమర్పించారు. అవినాష్ ముందస్తు బెయిల్ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావనను సీబీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తు ముగిశాక వివరాలు సమర్పిస్తామని అప్పట్లో హైకోర్టుకు తెలిపిన సీబీఐ.. తాజాగా అతని వివరాలను వెల్లడించింది. రహస్య సాక్షిగా వైసీపీ నేత వాంగ్మూలం జూన్ 30న కోర్టుకు సమర్పించారు. పులివెందుల వైసీపీ నేత కొమ్మ శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు. ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు తీసుకున్నారు. కడప ఎంపీగా అవినాష్ పోటీ చేయరని వివేకా తనతో చెప్పారని శివచంద్రారెడ్డి వాంగ్మూలంలో తెలిపారు.
2018 అక్టోబరు 1న వివేకా తన ఇంటికొచ్చారని.. వైసీపీను వీడొద్దని వివేకా తనని కోరినట్లు శివచంద్రారెడ్డి వెల్లడించారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో పనిచేయలేనని వివేకాతో చెప్పినట్లు తెలిపారు. అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారని పేర్కొన్నారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని వివేకా చెప్పారన్నారు. 2018 అక్టోబరు 1వరకు వైసీపీ సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా ఉన్నానని వెల్లడించారు. 2018 అక్టోబరు 2న వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కొమ్మా శివచంద్రారెడ్డి.. 2020 జూన్‌లో తిరిగి వైసీపీలో చేరారు. 2019 డిసెంబరు 7న కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేసిన సిట్.. టీడీపీ నుంచి వైసీపీలోకి మారడంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న మరోసారి విచారించిన సీబీఐ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నట్లు సీబీఐకి శివచంద్రారెడ్డి తెలిపారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని కేంద్ర దర్యాప్తు సంస్థ మే 25న తెరపైకి తీసుకువచ్చింది. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకానందరెడ్డికి ఇష్టం లేదని, కావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారంది. ఏప్రిల్ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేస్తామని, సాక్షిగానూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
- CBI Charge Sheet on Avinash: రాజకీయ వైరుధ్యాలతోనే వివేకా హత్యకు కుట్ర.. కానీ గుండెపోటు అని కట్టుకథ..
ఇప్పుడు ఆ సాక్షి పేరును బయటపెట్టలేము: ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సాక్షి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని స్పష్టం చేసింది. బయటపెడితే ఏమవుతుందో గతంలో జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆత్మహత్య, తొలుత వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం వంటి పలు సంఘటనలు రుజువు చేశాయని గుర్తు చేసింది. కావాలంటే వాంగ్మూలాన్ని కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని, దాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చంది.