కొవిడ్ మృతుల డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు (sc on covid) అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు రూపొందించే సరికి మూడో దశ కూడా వెళ్లిపోతుందని జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధా బోస్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబరు 11 లోగా ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా.. కొవిడ్ మరణాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల రూపకల్పన ఆలస్యం కావడంపై దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం జూన్ 30న కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి ఎంత మొత్తం చెల్లించగలరో మార్గదర్శకాలు రూపొందించాలని అందులో పేర్కొంది.
ఇదీ చదవండి : అండర్‌వేర్‌తోనే ఎమ్మెల్యే ట్రైన్ జర్నీ- అదే కారణమట!