తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ కేరళకు చెందిన బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. మరోవైపు.. ఈ కేసులో దోషిగా తేలిన మాజీ చర్చి అధికారి.. బాధితురాలిని వివాహం చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది.
ఇరువురి పిటిషన్లు పరిశీలించిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ కేసులో హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అందులో మేము కలుగజేసుకోవాలనుకోవట్లేదు.' అని పేర్కొంది. అయితే.. అత్యాచారానికి పాల్పడిన మాజీ మతాధికారిని వివాహం చేసుకునే విషయమై.. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు బాధితురాలికి అవకాశం కల్పించింది ధర్మాసనం.
వివాహానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అది ప్రాథమిక హక్కు అని దోషి తరఫు న్యాయవాది అమిత్ జార్జ్ ధర్మాసనానికి తెలిపారు. అయితే.. బాధితురాలు, దోషి వయసు ఎంత అని జార్జ్‌ను ప్రశ్నించింది ధర్మాసనం. దోషికి 49 ఏళ్లు కాగా.. బాధితురాలికి 25 ఏళ్ల వరకు ఉంటాయని తెలిపారు.
కేరళ, కొట్టియూర్‌కు చెందిన మైనర్‌పై ఓ చర్చి అధికారి అత్యాచారం చేశాడు. దోషిగా తేలిన క్రమంలో హైకోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే.. అత్యాచార బాధితురాలు గర్భం దాల్చి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వివాహం చేసుకునేందుకు బాధితురాలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
బాధితురాలని వివాహం చేసుకునేందుకు బెయిల్ కోరుతూ.. దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 16న కేరళ హైకోర్టు తిరస్కరించింది.
ఇదీ చూడండి: '66-ఏ'పై రాష్ట్రాలు, హైకోర్టులకు సుప్రీం నోటీసులు