ఆరుబయట దీపం వెలుతురులో సరదాగా మాట్లాడుకుంటూ కూర్చునే అమ్మమ్మలు, పైకప్పులో గడ్డి పరిచిన పూరిగుడిసెలు, మట్టి గోడలు, జానపద గేయాలు పాడుతూ, కొడవలితో వరి కోసే మహిళలు.. ఇవన్నీ గ్రామాల్లో తప్ప, మరెక్కడా కనిపించని సంఘటనలు, సందర్భాలు. కర్ణాటకలోని ఓ ఉద్యానవనంలో ఇవన్నీ కళాఖండాల రూపంలో దర్శనమిస్తాయి. హలక్కి గౌడ్రు, సిద్ది గౌలి సహా.. ఇతర ఆదివాసీ తెగలకు చెందిన ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే ప్రతిమలు ఈ గార్డెన్‌లో కనిపిస్తాయి. ఆ కళాఖండాలన్నీ రాతితో చెక్కినవే కావడం మరో ప్రత్యేకత. అందుకే దీనికి రాక్ గార్డెన్ అని పేరు. కార్‌వార్‌లో నిర్మించిన ఈ రాక్ గార్డెన్‌ను సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యటకులు తరలివస్తారు. ఆదివాసీ ప్రజల ఇళ్లు, వారి సంప్రదాయ, వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటి సరఫరా వ్యవస్థ, బావులు, పశువుల పెంపకం పద్ధతులు, వివిధ కులవృత్తుల నమూనాలు, ప్రకృతి, జంతువుల పెయింటింగ్స్.. ఇవన్నీ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. రాక్ గార్డెన్‌లో నెలకొల్పిన 30 అడుగుల ఎత్తైన జాలర్ల విగ్రహాలు మరో ప్రత్యేక ఆకర్షణ. పాతకాలంలో వాడుకలో ఉన్న వెదురు, కలపతో తయారుచేసిన ఊయల సహా.. ఇతర గ్రామీణ క్రీడల దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.
"ఈ ప్రాంతం చాలా బాగుంది. రాళ్లతో చేసిన కళాఖండాలు నాకు ఎంతగానో నచ్చాయి."
-రక్షా నవలే, పర్యటకురాలు
"సరదాగా గడిపేందుకు ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ఏడెనిమిది తెగలకు చెందిన ప్రజల సంస్కృతి, వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు...అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి."
-ఆశ, పర్యటకురాలు
4 కోట్ల వ్యయంతో, రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి సమీపంలో.. 5 ఎకరాల విస్తీర్ణంలో రాక్ గార్డెన్ నిర్మాణం చేపట్టారు. తోట చుట్టూరా ప్రహరీ గోడను సైతం రాళ్లతోనే నిర్మించారు.
ఉత్తర కర్ణాటక దట్టమైన అడవులకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో సిద్ధి, కునాబి, ముక్రి, గౌలి, హళక్కి, హాసల, గోండ జాతి తెగల ప్రజలు పెద్దసంఖ్యలో నివసిస్తారు. ఈ ప్రజల జీవనశైలి, ఆహారం, వారి సంస్కృతిని తెలియజేసేలా ఉద్యానవన నిర్మాణం జరిగింది.
"ఇంత అందమైన తోటను చూసి, నిజంగా ఆశ్చర్యపోయా. ఇలాంటి తోటలు నేను మునుపెన్నడూ చూడలేదు. అద్భుతంగా ఉంది."
-సురేష్, పర్యటకుడు
కార్‌వార్ బీచ్‌కు వచ్చే సందర్శకులంతా ఈ రాక్ గార్డెన్‌ను చూసేందుకు తరలివస్తారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న ఇలాంటి తోట ఇంకెక్కడా కనిపించదు.
ఇవీ చదవండి: పిల్లల ఉన్నత చదువుకు 'రేఖ' పొదుపు పథకం
సర్వ మతాల సారాన్ని చెప్పే.. మాముని ఖాతూన్