Odisha CM News: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చాలని సంకల్పించారు. అందులో భాగంగానే మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా పదవి నుంచి తప్పుకొన్నారు. అయితే తక్షణమే రాజీనామా చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించడం వల్లే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 11:45 గంటలకు కొత్తమంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనునన్నట్లు సమాచారం. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. సూర్యనారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నవీన్ పట్నాయక్ మంత్రివర్గాన్ని మార్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక జూన్ 20న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్, దుబాయ్‌ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: తాగుబోతు కోడి.. మందు లేనిదే ముద్ద ముట్టదట!